ముంబై, మే 24 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత మహారాష్ట్రలో మత్తు మందు ఇచ్చి వైద్య విద్యార్థినిపై సామూహిక లైంగిక దాడి చేసిన ఘటన సంచలనం రేపింది. ఈ ఘటన ఈ నెల 18న సాంగ్లి జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వైద్య విద్యార్థిని తన స్నేహితుడితో సినిమాకు వెళ్లింది. సినిమా అయిపోయాక అతను యువతిని ఫ్లాట్‌కు తీసుకెళ్లాడు. అనంతరం ఆమెకు మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చాడు. బాధితురాలు మత్తులోకి జారుకోగానే స్నేహితుడితో పాటు మరో ఇద్దరు కలిపి ఆమెపై సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు.
కాసేపటి తర్వాత స్పృహలోకి వచ్చిన బాధితురాలు తనపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని గమనించి తన స్నేహితుడిని ప్రశ్నించింది. అయితే ఈ విషయాన్ని ఎవరికైనా చెబితే చంపుతానని అతడు ఆమెను బెదిరించాడు. అయితే ఇంటికి చేరుకున్న ఆ యువతి జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో వారు వెంటనే విశ్రామ్బాగ్ పోలీసులను ఆశ్రయించారు. కేసు దర్యాప్తు జరిపిన పోలీసులు నిందితులను వినయ్ విశ్వేష్ పాటిల్(22), సర్వజ్ఞ సంతోష్ గైక్వాడ్(20), తన్మయ్ సుకుమార్ పెడ్నేకర్(21)లుగా గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం కోర్టులో హాజరు పరచగా మే 27 వరకు పోలీసు కస్టడీకి అప్పగించింది.