లక్నో: దేశంలో మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి (Mayawati ) ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వాల నిర్లక్ష్యంపై మండిపడ్డారు. అలాగే మహిళల భద్రత పట్ల ప్రభుత్వ విధానాలను ఆమె ప్రశ్నించారు. ఉత్తరప్రదేశ్, బెంగాల్, ఒడిశా, కర్ణాటక సహా దేశ వ్యాప్తంగా మహిళలపై నేరాలు పెరుగుతున్నాయని మాయావతి ట్వీట్ చేశారు. అయితే పెరుగుతున్న నేరాల సంఘటనలపై ప్రత్యారోపణలతో సంకుచిత రాజకీయాలకు పాల్పడడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో మహిళల భద్రత, గౌరవానికి సంబంధించి ప్రభుత్వాల ఉద్దేశాలు, విధానాల్లో తీవ్ర లోపం ఉన్నదా? అని ప్రశ్నించారు. అలా అయితే దీని గురించి తీవ్రంగా ఆలోచించాల్సిన సమయం ఇదేనని ఎక్స్‌లో ఆదివారం పోస్ట్ చేశారు.
కాగా, మహిళలపై నేరాల పట్ల ప్రభుత్వాల నిర్లక్ష్యం, పోలీసుల ప్రమేయం పరిస్థితిని మరింత తీవ్రంగా మారుస్తున్నదని మాయావతి విమర్శించారు. ఈ నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలని, నిష్పక్షపాతంగా, సీరియస్‌గా వ్యవహరించడం ప్రతి ఒక్కరికీ చాలా ముఖ్యమని సూచించారు. తద్వారా ఇలాంటి ఘోరమైన నేరాల వల్ల రాష్ట్రం, దేశం అపఖ్యాతి కాకుండా కాపాడుకోవచ్చని వరుస ట్వీట్లలో పేర్కొన్నారు.