Mayavati : ఇటీవల రిజర్వేషన్లపై ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీఎస్పీ చీఫ్, యూపీ మాజీ సీఎం మాయావతి స్పందించారు. రిజర్వేషన్లను అంతం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ఏళ్ల తరబడి కుట్ర చేస్తోందని ఆమె ఆరోపించారు. అణగారిన వర్గాల ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ఈ మేరకు ఆమె ఎక్స్ లో పోస్ట్ చేశారు.
అమెరికాలో ఇటీవల రాహుల్ గాంధీ చేసిన కామెంట్స్ ఓ డ్రామా అని, ఆయన వైఖరిని ప్రజలు అర్థం చేసుకోవాలని మాయావతి మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఓబీసీ రిజర్వేషన్లను అమలు చేయలేదని, కుల గణన సైతం చేపట్టలేదని విమర్శించారు. కానీ ప్రస్తుతం ఈ రెండు అంశాల ముసుగులో అధికారంలోకి రావాలని కలలు కంటోందని ఎద్దేవా చేశారు.
భవిష్యత్లో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ కులగణన నిర్వహించలేదని వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని, రిజర్వేషన్లను కాపాడుతున్నట్టు నటిస్తున్న కాంగ్రెస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రాజ్యాంగాన్ని రక్షించే నెపంతో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లను కచ్చితంగా అంతం చేస్తుందని అన్నారు.