న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా పిల్లలు, పెద్దలు ఎంతో ఇష్టపడే బార్బీ బొమ్మ ఈసారి రూపు మార్చింది. గత ఏడాది సరిగ్గా ఇదే నెలలో దృష్టిలోపం ఉన్న చిన్నారుల కోసం చేతిలో కర్ర, కళ్లద్దాలతో ఉన్న బార్బీ బొమ్మను విడుదల చేసిన తయారీ సంస్థ మాటెల్.. ఈసారి డయాబెటిస్ బార్బీని విడుదల చేసింది. మాటెల్ తన ఫ్యాషనిస్టాస్ సిరీస్‌లో భాగంగా ఈ ప్రత్యేక బొమ్మను అందుబాటులోకి తెచ్చి తన సామాజిక స్పృహను చాటుకుంది. పిల్లలు ఆడుకునే బొమ్మల్లో వాస్తవ ప్రపంచాన్ని ప్రతిబింబించేలా చూడాలన్నది తమ ఉద్దేశమని మాటెల్ పేర్కొంది.
టైప్-1 డయాబెటిస్తో బాధపడుతున్న చిన్నారుల్లో స్ఫూర్తి నింపేందుకు, వారిలో ఆత్మవిశ్వాసం పెంచేందుకు తీసుకొచ్చిన ఈ బార్బీ బొమ్మ చేతికి ఒక గ్లూకోమీటర్ అమర్చారు. శరీరానికి ఇన్సులిన్ అందించే పంప్‌ను నడుముకు ఏర్పాటు చేశారు. వీటితోపాటు గ్లూకోమీటర్ రీడింగ్‌ను చూపించే ట్రాకింగ్ యాప్ ఉన్న ఒక ఫోన్‌ను కూడా బొమ్మతో పాటు అందిస్తున్నారు. నీలిరంగు చుక్కల దుస్తులు ధరించిన ఈ బార్బీ చేతిలో స్నాక్స్ పెట్టుకునేందుకు ఓ బ్యాగ్ కూడా ఉంది. అనారోగ్యాలు, వైకల్యాలు జీవితంలో భాగమని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలనే సందేశాన్ని చిన్నారులకు అందించడమే తమ లక్ష్యమని మాటెల్ తెలిపింది.