Layoffs | న్యూఢిల్లీ : సాంకేతిక ప్రపంచం వేగంగా పరిణామం చెందుతున్నది. ఒకప్పుడు ఉదోగాల సృష్టికి కేంద్రంగా ఉండే టెక్ రంగం (IT Companies) ఇప్పుడు లక్షల మంది (Layoffs) ఉద్యోగులను ఇంటికి పంపుతున్నది. ఈ ఏడాది లక్షకుపైగా ఉద్యోగులను కోల్పోవడం ఒక గణాంకం మాత్రమే కాదు. ఒక హెచ్చరిక కూడా. లేఆఫ్స్ డాట్ ఎఫ్‌వైఐ డాటా ప్రకారం ఈ ఏడాది ఇప్పటివరకు 218 కంపెనీలు సుమారు 1,00,000 మందికి పైగా ఉద్యోగులను తొలగించాయి. సిలికాన్ వ్యాలీ నుంచి బెంగళూరు వరకు ఒకప్పుడు ఉద్యోగులతో కళకళలాడిన దిగ్గజ సంస్థలు ఇప్పుడు కృత్రిమ మేధస్సు (AI), క్లౌడ్ సేవలు, లాభదాయకతపై దృష్టి సారించేందుకు సిబ్బందిని క్రమంగా తగ్గించుకుంటున్నాయి.
ఇంటెల్ ఈ ఏడాదిలో అతిపెద్ద కోతను ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 22 శాతం అంటే 24,000 మందిని తొలగిస్తున్నది. ఎన్విడియా, ఏఎండీలతో పోటీపడేందుకు ఈ పునర్వ్యవస్థీకరణ చేపట్టింది. అమెజాన్.. ఆపరేషన్స్, హెచ్ఆర్, క్లౌడ్ విభాగాల్లో 14,000 కార్పొరేట్ ఉద్యోగాలను తగ్గించింది. ‘అమెజాన్‌ను ప్రపంచంలోనే అతిపెద్ద స్టార్టప్‌లా నడపడం’లో భాగంగానే ఈ కోతలు చేపట్టినట్టు సీఈవో ఆండీ జెస్సీ చెప్పారు. ఇక మైక్రోసాఫ్ట్ ప్రొడక్ట్, సాఫ్ట్వేర్ విభాగాల్లో సుమారు 9,000 మందిని తొలగించి తమ వనరులను ఏఐ, క్లౌడ్ ఆవిష్కరణల వైపు మళ్లిస్తున్నది. గూగుల్, మెటా సంస్థలు ఆండ్రాయిడ్ హార్డ్‌వేర్, ఎక్స్ విభాగాల్లో ఖర్చులను తగ్గించుకోవడానికి ఉద్యోగుల సంఖ్యను తగ్గించాయి. ఒరాకిల్ కూడా యూఎస్‌లో వందలాది మంది ఉద్యోగులను రోడ్డున పడేసింది.
భారతదేశంలో అతిపెద్ద సాఫ్ట్వేర్ ఎగుమతిదారు టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) సైతం జూలై-సెప్టెంబర్ త్రైమాసికంలో దాదాపు 20,000 ఉద్యోగాలను తగ్గించుకుంది. ఏఐ ఆధారిత పునర్వ్యవస్థీకరణ, పెరుగుతున్న నైపుణ్యాల వ్యత్యాసాన్ని దీనికి కారణంగా పేర్కొంది. ఇతర భారతీయ ఐటీ సంస్థలు కూడా ఆటోమేషన్ కారణంగా నియామకాలపై అప్రమత్తంగా ఉన్నాయి.
ఈ కోతల ప్రభావం కేవలం టెక్ రంగానికే పరిమితం కాలేదు. ఇతర రంగాలూ అతలాకుతలం అవుతున్నాయి. యూపీఎస్ లాజిస్టిక్స్ నెట్‌వర్క్‌లో ఆటోమేషన్ కారణంగా 48,000 మందిని తొలగిస్తూ అతిపెద్ద తగ్గింపును చేపట్టింది. ఫోర్డ్ ఎలక్ట్రిక్ వాహన కార్యకలాపాలను క్రమబద్ధీకరించడానికి 8,000 నుంచి 13,000 ఉద్యోగాలను తగ్గించాలని యోచిస్తున్నది. పీడబ్ల్యూసీ.. పన్ను, ఆడిట్ ప్రక్రియల్లో ఏఐ ఏకీకరణ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 5,600 ఉద్యోగాలను తగ్గించింది. ప్రస్తుత టెక్ ప్రపంచం మానవ శ్రమ నుంచి ఏఐ ఆధారిత ఉత్పాదకత వైపు పయనిస్తున్నది. ఈ ప్రయాణంలో కొన్ని సంప్రదాయ పాత్రలు కనుమరుగవుతాయి. మరికొన్ని కొత్త పాత్రలు పుట్టుకొస్తాయి.