Maha Kumbh | ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో మరోసారి అగ్నిప్రమాదం (Massive fire) సంభవించింది. సెక్టార్-8 ప్రాంతంలో సోమవారం మధ్యాహ్నం మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన అధికారులు.. యాత్రికులను అక్కడి నుంచి ఖాళీ చేయించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. అయితే, ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదని తెలిసింది. కాగా, మహాకుంభ్‌లో 30 రోజుల వ్యవధిలోనే అగ్నిప్రమాదం జరగడం ఇది ఏడోసారి కావడం గమనార్హం.
తొలుత జనవరి 19వ తేదీన మహా కుంభమేళాలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో సెక్టార్ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతయ్యాయి. అదేనెల 25వ తేదీన మరోసారి అగ్నిప్రమాదం జరిగింది. సెక్టార్ 2 సమీపంలోని పార్కింగ్ ఏరియాలో మంటలు చెలరేగి పలు వాహనాలు దగ్ధమయ్యాయి. జనవరి 30న సెక్టర్ 22లో ఛత్నాగ్ ఝాన్సీ (Chhatnag Jhunsi) ప్రాంతంలో నిర్మించిన టెంట్ సిటీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో డజనుకుపైగా టెంట్లు కాలిపోయాయి. ఆ తర్వాత ఫిబ్రవరి 7వ తేదీన శంకరాచార్య మార్గ్ (Shankaracharya Marg)లోని సెక్టార్ 18లో మంటలు చెలరేగాయి. ఆ తర్వాత ఫిబ్రవరి13, 15 తేదీల్లోనూ మహాకుంభమేళా ప్రాంతంలో అగ్నిప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అదృష్టవశాత్తూ ఆయా ప్రమాదాల్లో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు.
ఇదిలా ఉండగా.. ఈ మహాకుంభమేళాకు భక్తుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది. పౌష్ పూర్ణిమ సందర్భంగా జనవరి 13వ తేదీన ప్రారంభమైన మహా కుంభమేళా.. ఫిబ్రవరి 26 శివరాత్రి రోజున ముగియనుంది. దాదాపు 45 రోజులపాటూ జరిగే ఈ మహా కుంభమేళాకు ఇప్పటి వరకూ 53 కోట్ల మంది హాజరయ్యారు. పవిత్ర త్రివేణీ సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిచారు.
Also Read..
Delhi stampede | రైల్వేకు సగం మంత్రి, పార్ట్‌టైమ్ మంత్రి.. అశ్విని వైష్ణవ్‌పై టీఎంసీ మండిపాటు
Railway Station | ఢిల్లీ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట.. ప్లాట్‌ఫారమ్ టికెట్ల విక్రయాలు బంద్..!
Holding Zones | తొక్కిసలాట ఘటన నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం.. 60 స్టేషన్లలో ‘హోల్డింగ్ ప్రాంతాలు’