Holding Zones | ఢిల్లీ రైల్వే స్టేషన్లో తొక్కిసలాట (Delhi stampede) ఘటన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ సమయాల్లో తొక్కిసలాట ఘటనలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే దేశవ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ ఉండే 60 రైల్వే స్టేషన్లలో (railway stations) శాశ్వత హోల్డింగ్ ప్రాంతాలను (Holding Zones) ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.
అంతేకాదు రైలు ఆలస్యమైన సమయంలో జనాల కదలికలను పర్యవేక్షించేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) సహా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రద్దీ నియంత్రణ, విపత్తు నిర్వహణ కోసం కృత్రిమ మేధను వినియోగించనున్నట్లు సదరు వర్గాలు వెల్లడించాయి. దీనిపై అవగాహన కల్పించేందుకు స్థానిక అధికారులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నాయి. ఈ హోల్డింగ్ ఏరియాల వద్దకు ప్రయాణికులు వెళ్లేందుకు వీలుగా సెపరేటర్లు, గుర్తులు ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం.
కాగా, న్యూఢిల్లీ రైల్వే స్టేషన్లో శనివారం రాత్రి తొక్కిసలాట చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ప్రయాగ్ రాజ్ ఎక్స్‌ప్రెస్, ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైళ్ల పేర్లు రెండూ ఒకేలా ఉండటమే ప్రమాదానికి కారణమని ప్రత్యక్ష సాక్షులు కొందరు తెలిపారు. శనివారం రాత్రి 9.45 గంటల ప్రాంతంలో ప్లాట్ఫారం 14పై ప్రయాగ్‌రాజ్ ఎక్స్‌ప్రెస్ ఉంది. అదే సమయంలో ప్రయాగ్‌రాజ్ స్పెషల్ రైలు 12వ నంబర్ ప్లాట్‌ఫాంపైకి వస్తున్నట్టు అనౌన్స్ చేశారు.
అయితే అప్పటికే 14వ ప్లాట్‌ఫాంపై వేచి చూస్తున్న చాలామంది తాము ఎక్కాల్సింది అ రైలేమోనని భావించి గందరగోళానికి గురయ్యి 12వ నంబర్ పైకి వెళ్లడానికి ఓవర్ బ్రిడ్జి వైపు పరుగులు తీశారు. మరికొందరు జనరల్ టికెట్లు తీసుకున్న వారు సైతం అందులో సీటు దొరుకుతుందేమోనని పరుగులు పెట్టారు. ఈ క్రమంలో అక్కడ తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో 14 మంది మహిళలు, నలుగురు పిల్ల లు ఉండగా.. 10 ఏండ్ల లోపు వారు ఇద్దరు ఉన్నారు. డజను మందికి పైగా ప్రయాణికులు గాయపడగా, వారికి లోక్‌నాయక్ జయ్‌ప్రకాశ్ హాస్పిటల్లో చికిత్స అందిస్తున్నారు.
Also Read..
Student | ఆకాశంలో ఎగురుతూ పరీక్ష కేంద్రానికి.. ట్రాఫిక్‌ను అధిగమించేందుకు విద్యార్థి ఉపాయం
Ayodhya | అయోధ్యకు పోటెత్తుతున్న భక్తులు.. కిక్కిరిసిన శ్రీరామ జన్మభూమి దర్శన మార్గ్