ప్రయాగ్‌రాజ్: ప్రయాగ్‌రాజ్‌లోని మహాకుంభమేళాలో ఆదివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఎల్పీజీ సిలిండర్ పేలడంతో సెక్టార్ 19లో మంటలు చెలరేగి 18 గుడారాలు ఆహుతైనట్టు అధికారులు తెలిపారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. నల్లటి దట్టమైన పొగలు అలుముకోవడంతో అఖాడాల సమీపంలో భయాందోళన నెలకొంది. సాయంత్రం 4 గంటలకు మంటలు అంటుకోగా గంటలోపలే మంటలు అదుపులోకి వచ్చాయని అధికారులు తెలిపారు.
కాగా, మౌని అమావాస్య ఏర్పాట్లను సమీక్షించేందుకు ప్రయాగ్‌రాజ్‌లోనే ఉన్న సీఎం యోగి ఆదిత్యనాథ్ ఘటనా స్థలిని పరిశీలించారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ సైతం సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు ఫోన్ చేసి ఘటనకు సంబంధించిన వివరాలు తెలుసుకున్నారు. 45 రోజులపాటు జరిగే మహా కుంభమేళా జనవరి 13న పౌష పూర్ణిమ నాడు ప్రారంభమైంది. శనివారం వరకు 7.72 కోట్ల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఆదివారం దాదాపు 46.95 లక్షల మంది పవిత్ర స్నానాలు ఆచరించారని అధికారులు చెప్పారు.