(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): పశ్చిమాసియా మళ్లీ భగ్గుమన్నది. ఇరాన్‌తో అణు ఒప్పందంపై ప్రతిష్ఠంభన కొనసాగుతున్న వేళ ఆ దేశంపై అమెరికా-ఇజ్రాయెల్ దళాలు శనివారం ఉదయం అనూహ్యంగా దాడికి దిగాయి. రాజధాని నగరం టెహ్రాన్‌కు ఉత్తరాన ఉన్న 30 ప్రాంతాలే లక్ష్యంగా ఈ క్షిపణి దాడులు జరిగాయి. దీంతో టెహ్రాన్ అంతటా పేలుడు శబ్దాలు వినిపించాయి. దట్టమైన పొగ వ్యాపించింది. దక్షిణ ఇరాన్‌లోని ఓ బాలికల పాఠశాలపై జరిగిన బాంబు దాడిలో 85 మంది విద్యార్థులు మృత్యువాతపడ్డారు. మొత్తంగా దాడుల్లో 200 మంది మృతిచెందినట్టు సమాచారం.
అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సంయుక్త దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్, ఆ దేశ రక్షణ మంత్రి అమీర్ మరణించినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. తమ సైనిక చర్యను ‘ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ’గా అమెరికా రక్షణ శాఖ కార్యాలయం పెంటగాన్ పేర్కొన్నది. ఇజ్రాయెల్ దాడులను ‘ఆపరేషన్ రోరింగ్ లయన్’గా ఆ దేశ ప్రధాని నెతన్యాహు పేర్కొన్నారు. తమపై దాడులకు ప్రతీకారంగా ఇరాన్ సైతం ఇజ్రాయెల్, అమెరికా స్థావరాలపై విరుచుకుపడింది.
పశ్చిమాసియాలోని అమెరికా స్థావరాలే లక్ష్యంగా 8 దేశాలపై ఏకకాలంలో క్షిపణులు, డ్రోన్లతో దాడులకు దిగింది. ఇరాక్‌లోని అమెరికా కాన్సులేట్‌ను ఇరాన్ పేల్చేసింది. డ్రోన్ దాడులతో దుబాయ్ దద్దరిల్లింది. ప్రఖ్యాత పామ్ జుమెరా హోటల్‌పై డ్రోన్ దాడి జరిగింది. బుర్జ్ ఖలీఫాను అధికారులు ఖాళీ చేయించారు. ఇరాన్, ఇజ్రాయెల్‌లో పరిస్థితులు అంతకంతకూ దిగజారుతుండటంతో అక్కడి ఇండియన్స్‌కు భారత ఎంబసీ అడ్వైజరీ జారీ చేసింది. అప్రమత్తంగా ఉండాలని, ఎప్పటికప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్స్‌ను పాటించాలని సూచించింది.
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై శనివారం ఉదయం ఇజ్రాయెల్ క్షిపణులతో భీకర దాడులు చేపట్టింది. ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్ నివాసం, అధ్యక్షుడి కార్యాలయం, ప్రభుత్వ, నిఘా ప్రధాన కార్యాలయాలు, క్షిపణి స్థావరాలు సహా మొత్తం 30 ప్రాంతాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఈ దాడులను జరిపింది.

అయితే మొదటి దాడి ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ కార్యాలయం సమీపంలోనే జరిగినట్టు తెలిసింది. అయితే, ఆ సమయంలో ఖమేనీ టెహ్రాన్‌లో లేరని, దాడుల విషయం ముందే తెలిసి ఆయన్ని సురక్షిత ప్రాంతంలోని బంకర్లోకి తరలించినట్టు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్లో 200 మందికిపైగా మృతిచెందారని, 700 మందికిపైగా మరణించినట్టు వార్తలు వచ్చాయి.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీనే టార్గెట్‌గా ఈ దాడులు జరిపామని ఇజ్రాయెల్ ప్రకటించింది. తమ దాడుల్లో ఇరాన్‌కు చెందిన పలువురు సీనియర్ కమాండర్లు మరణించినట్టు పేర్కొన్నది. అమెరికా, ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ మృతి చెందినట్టు ఇజ్రాయెల్ తెలిపింది. అయితే, దీన్ని ఇరాన్ ఇంకా ధ్రువీకరించలేదు. మరోవైపు, దక్షిణ ఇరాన్‌లోని మినాబ్ పట్టణంలో ఉన్న ఓ ఎలిమెంటరీ బాలికల పాఠశాలపై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 85మంది విద్యార్థినులు మృత్యువాతపడ్డారు. మరో 45 మందికి తీవ్ర గాయాలయ్యాయి.
తమపై జరిగిన దాడులకు ప్రతిగా ఇరాన్ కూడా పెద్దయెత్తున క్షిపణి దాడులకు దిగింది. ఇజ్రాయెల్‌తో పాటు పశ్చిమాసియాలోని అమెరికా సైనిక స్థావరాలే లక్ష్యంగా మిస్సైల్స్‌తో విరుచుకుపడింది. ఏకకాలంలో ఏకంగా 8 దేశాలపై దాడులు జరిపింది. ఇరాన్ దాడులు జరిపిన దేశాల జాబితాలో ఇజ్రాయెల్‌తో పాటు బహ్రెయిన్, కువైట్, సౌదీ, ఇరాక్, ఖతర్, జోర్డాన్, యూఏఈ దేశాలు ఉన్నాయి. తమ దేశంలోని అమెరికా నేవీ 5వ ఫ్లీట్‌పై ఇరాన్ క్షిపణులతో దాడులకు పాల్పడిందని బహ్రెయిన్ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు.
యూఏఈ, కువైట్‌లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ దాడులు చేసినట్టు మీడియాలో కథనాలు వచ్చాయి. ఇరాన్ దాడుల్లో యూఏఈలో ఒకరు మరణించినట్టు సమాచారం. ఇరాక్‌లోని అమెరికా కాన్సులేట్‌ను ఇరాన్ పేల్చేసినట్టు వార్తలు వచ్చాయి. అమెరికా మొదలుపెట్టిన యుద్ధానికి తాము ముగింపు ఇస్తామని, ఊహించని రీతిలో ఆ ముగింపు ఉంటుందని ఇరాన్ సైన్యం హెచ్చరించింది. తాము ఇప్పటివరకూ పనికిరానటువంటి సాధారణ పాత ఆయుధాలే వాడామని, కొత్తవి వాడితే ట్రంప్ తట్టుకోలేరని పేర్కొన్నది.
టెహ్రాన్‌పై దాడులు తమ పనేనని ఇజ్రాయెల్ ప్రకటించింది. శత్రు దేశం నుంచి పొంచి ఉన్న ముప్పును తప్పించేందుకు ఈ దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి కట్జ్ పేర్కొన్నారు. ఇరాన్ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ తమ దేశ పౌరులను అప్రమత్తం చేసింది. ఎమర్జెన్సీ విధించింది. ఇరాన్ క్షిపణులు విరుచుకుపడటంతో పలు నగరాల్లో రోజంతా సైరన్లు మోగాయి.
ఇజ్రాయెల్, అమెరికా దాడులకు ప్రతీకారంగా తాము పశ్చిమాసియాలోని 14 యూఎస్ స్థావరాలపై దాడి చేసినట్టు ఇరాన్ ప్రకటించింది. ఈ దాడుల్లో 100 మందికిపైగా అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్జీసీ) ఖతమ్ ఓల్ అన్బియా కమాండ్ ప్రతినిధి శనివారం తెలిపారు.

తమ దేశంపై అమెరికా జరిపిన దాడికి ప్రతీకారంగానే యూఎస్ స్థావరాలపై తాము దాడులు చేసినట్టు ఇరాన్ అధికారులు తెలిపారు. అయితే ఈ దాడుల తీవ్రత, ఎంతమంది మరణించినదీ అమెరికా అధికారికంగా వెల్లడించ లేదు. అమెరికాతో యుద్ధం నేపథ్యంలో హొర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలపై ఇరాన్ ఆంక్షలు విధించింది.
గల్ఫ్‌లో అమెరికా మిత్ర దేశాల్లోని పలు స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం కురిపిస్తున్నది. దీంతో ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం అక్కడి అధికారులు మూసివేశారు. దీంతో వేలాదిమంది ప్రయాణికులు దుబాయ్ విమానాశ్రయంలో చిక్కుకున్నారు. మరోవైపు దుబాయ్‌లోని ప్రముఖ హోటల్ పామ్జుమేరాపైన ఇరాన్ దాడి చేసింది. అలాగే కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయం లక్ష్యంగా డ్రోన్ దాడి జరిగినట్టు కువైట్‌కు చెందిన ఒక వార్తాసంస్థ తెలిపింది.
భవనం సమీపంలో పేలుడు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భనవంగా పేరుపొందిన దుబాయ్‌లోని బుర్జ్ ఖలీఫాపై దాడి జరిగిందా? బుర్జ్ ఖలీఫా సమీపంలో ఓ భారీ పేలుడు సంభవించి దట్టమైన నల్లటి పొగ వ్యాపించిన దృశ్యాలతో ఓ వీడియో సోషల్ మీడియాలో దర్శనమిచ్చింది. ఇరాన్ జరిపిన డ్రోన్ దాడిలో బుర్జ్ ఖలీఫాకు ఏమైనా నష్టం జరిగిందీ లేనిదీ అధికారికంగా తెలియరాలేదు. దుబాయ్ నడిబొడ్డున 828 మీటర్ల ఎత్తైన బుర్జ్ ఖలీఫా విలువ దాదాపు 150కోట్ల డాలర్లు ఉంటుందని అంచనా. దీన్ని నిర్మించిన ఎమార్ ప్రాపర్టీస్ సుమా రు 150 కోట్ల డాలర్లకు ఈ ఆకాశ హర్మ్యాన్ని బీమా చేయించింది.
ప్రపంచంలోని ఉగ్రవాదానికి ఇరాన్ అతిపెద్ద మద్దతుదారు. నిరసనలు చేపట్టారని సొంత పౌరులనే అక్కడ పొట్టనబెట్టుకొన్నారు. ఉగ్రవాద పాలనలో ఉన్న ఆ దేశం దగ్గర అణ్వాయుధాలు ఉండటం ఎంతో ప్రమాదకరం. అందుకే, వాటిని నాశనం చేస్తున్నాం. ఇప్పటికైనా మా మాటలు వినకపోతే, ఆ దేశాన్నే నాశనం చేస్తాం.
– అమెరికా అధ్యక్షుడు ట్రంప్
ఇరాన్ నుంచి మాకు అస్తిత్వ ముప్పు పొంచి ఉన్నది. 47 ఏండ్లుగా వారి పాలన మాకే కాకుండా అమెరికాకు కూడా ప్రమాదకరంగా మారింది. అమెరికన్లతో పాటు మా పౌరులనూ ఊచకోత కోసింది. ఇలాంటి వారికి అణ్వాయుధాలను ఇచ్చి మానవాళిని బెదిరించే అవకాశం ఇవ్వకూడదు. అందుకే అమెరికాతో కలిసి ఈ ఆపరేషన్ చేపట్టాం.
– ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు