న్యూఢిల్లీ: జీమెయిల్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, నెట్ఫ్లిక్స్ వంటి ఇంటర్నెట్ సంస్థలకు చెందిన 14.90 కోట్లకు పైగా ఖాతాల యూజర్ పేర్లు, పాస్వర్డులు సహా లాగిన్ వివరాలు లీక్ అయినట్లు ఎక్స్ప్రెస్ వీపీఎన్ ఇటీవల ప్రచురించిన ఓ నివేదిక వెల్లడించింది.
సైబర్ సెక్యూరిటీ పరిశోధకుడు ఫౌలర్ ప్రచురించిన నివేదిక ప్రకారం బహిరంగంగా కనిపించే డేటాలో జీమెయిల్లో 4.8 కోట్ల ఖాతాలు, యాహూలో 40 లక్షలు, ఫేస్బుక్లో 1.70 లక్షలు, ఇన్స్టాగ్రామ్లో 65 లక్షలు, నెట్ఫ్లిక్స్ 34 లక్షలు, ఔట్లుక్లో 15 లక్షల ఖాతాలు ఉన్నాయి. బహిర్గతమైన డేటాబేస్ పాస్వర్డ్-రక్షిత లేదా ఎన్క్రిప్టెడ్ కాదని, ఇందులో 14,94,04,754 ప్రత్యేకమైన లాగిన్లు, పాస్వర్డ్లు ఉన్నాయని తన నివేదికలో ఆయన పేర్కొన్నారు. మొత్తం 96 జీబీ ముడి ఆధారాల డేటా ఉందని, బహిర్గతమైన పత్రాలను పరిశీలించిన ఫౌలర్ తన నివేదికలో తెలిపారు.