తిరువనంతపురం : కేరళలోని తిరువనంతపురంలో 23 ఏండ్ల యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. అఫ్ఫాన్ వరుసగా తన కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులైన ఐదుగురిని కొట్టి చంపాడు. అనంతరం సమీపంలోని పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది. తన తల్లిపైనా దాడి చేయగా, ఆమె దవాఖానలో కొన ఊపిరితో ఉన్నారు. అఫ్ఫాన్ వరుసగా మూడు ఇండ్లల్లో ఉన్నవారిపై పదునైన ఆయుధంతో దాడులకు దిగగా, ఈ ఘటనలో పెదనాన్న, పెద్దమ్మ, నానమ్మ, 13 ఏండ్ల సోదరుడు, గర్ల్‌ఫ్రెండ్ హతమైనట్టు పోలీసులు గుర్తించారు. అఫ్ఫాన్ తొలుత పదునైన ఆయుధంతో తన ఇంట్లో ఉన్న తల్లి, గర్ల్‌ఫ్రెండ్‌పై దాడికి పాల్పడ్డాడు. అటు తర్వాత 13 ఏండ్ల సోదరుడిని సుత్తితో కొట్టి హత్య చేశాడు. ఆ తర్వాత పెదనాన ఇంటికి వెళ్లి వాగ్వాదానికి దిగి.. వారిపైనా దాడికి పాల్పడ్డాడు. అటు తర్వాత నానమ్మ ఇంటికి వెళ్లి ఆమెను కూడా చంపినట్టు తెలిసింది. హత్యలకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.