భోపాల్ : పెండ్లి చేసుకొమ్మని ఒత్తిడి చేసినందుకు సహజీవనం చేస్తున్న మహిళను ఓ వ్యక్తి హత్య చేసి శవాన్ని రిఫ్రిజిరేటర్లో దాచిన దారుణం మధ్యప్రదేశ్‌లోని దేవస్లో వెలుగు చూసింది. ఎనిమిది నెలలుగా ఫ్రిజ్‌లో దాచి ఉంచడంతో కుళ్లిపోయిన స్థితిలో ఉన్న ఆ మహిళ మృతదేహాన్ని పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పింకీ ప్రజాపతి(30) అనే మహిళదిగా పోలీసులు గుర్తించారు. ఆమెను సంజయ్ పాటిదార్ అనే వ్యక్తి గత ఏడాది జూన్‌లో హత్య చేసి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. నిందితుడ్ని అరెస్టు చేసి కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఉజ్జయిన్ నివాసి అయిన పాటిదార్‌కు మరో మహిళతో వివాహమైందని, గత ఐదేళ్లుగా అతడు పింకీ ప్రజాపతితో సహజీవనం చేస్తున్నాడని వారు తెలిపారు. పెండ్లి చేసుకోవాలంటూ పింకీ నుంచి ఒత్తిడి పెరిగిపోవడంతో తన స్నేహితుని సాయంతో పాటిదార్ ఆమెను హత్య చేసినట్టు పోలీసులు చెప్పారు. ఇంట్లో నుంచి దుర్వాసన రావటంతో పొరుగున ఉన్నవారు ఆ ఇంటి యజమానిని పిలిపించారు. అతడి ద్వారా హత్య విషయం వెలుగు చూసింది.