ముంబై: సహజీవనం చేస్తున్న మహిళను ఒక వ్యక్తి హత్య చేశాడు. (Man Kills Live In Partner ) ఆమె మృతదేహాన్ని పడేసేందుకు అతడి భార్య కూడా సహకరించింది. మహారాష్ట్రలోని పాల్ఘడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. వివాహితుడైన 43 ఏండ్ల మనోహర్ శుక్లా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేసేవాడు. మేకప్ ఆర్టిస్ట్ అయిన 28 ఏండ్ల నైనా మహత్తో అతడికి పరిచయం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఐదేండ్లుగా వారిద్దరూ సహ జీవనం చేస్తున్నారు. దీంతో తనను పెళ్లి చేసుకోమని అతడిని ఒత్తిడి చేసింది. శుక్లా నిరాకరించడంతో తనపై అత్యాచారం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
కాగా, ఆ ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలంటూ నైనాను శుక్లా బెదిరించాడు. మాట వినకపోవడంతో ఆగస్ట్ 9-12 మధ్య ఆమెను హత్య చేశాడు. అనంతరం భార్య సహాయంతో నైనా మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కాడు. పొరుగున ఉన్న గుజరాత్‌లోని వల్సాద్ వద్ద ఒక కాలువలో మృతదేహాన్ని పడేశాడు.
మరోవైపు నైనా మిస్సింగ్‌పై ఆమె సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అత్యాచారం ఫిర్యాదును వెనక్కి తీసుకోవాలని శుక్లా బెదిరించినట్లు ఆరోపించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. చివరకు నిందితులైన శుక్లా, అతడి భార్యను మంగళవారం అరెస్ట్ చేశారు. కాగా, శుక్లాపై మరో పోలీస్ స్టేషన్లో కూడా మరో కేసు నమోదైన్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.