బెంగళూరు: ఒక యువతి పెళ్లికి నిరాకరించింది. దీంతో ఆగ్రహించిన ప్రియుడు కత్తితో గొంతు కోసి ఆమెను హత్య చేశాడు. (Man Kills Woman) ఆ తర్వాత అదే కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కర్ణాటకలోని బెళగావి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. యెల్లూర్ గ్రామానికి చెందిన 29 ఏళ్ల ప్రశాంత్ కుండేకర్, పెయింటర్‌గా పని చేస్తున్నాడు. 20 ఏళ్ల ఐశ్వర్య మహేష్ లోహర్‌ను ఏడాదిగా అతడు ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని ఆమె తల్లితో చెప్పాడు. అయితే ఆర్థికంగా స్థిరపడాలని ఆమె సూచించింది.
కాగా, మార్చి 4న ఐశ్వర్య నివసిస్తున్న ఇంటికి ప్రశాంత్ వెళ్లాడు. తనను పెళ్లి చేసుకోవాలని మరోసారి అడిగాడు. ఆమె నిరాకరించడంతో వెంట తెచ్చిన విషాన్ని తాగాలని బలవంతం చేశాడు. ఐశ్వర్య ప్రతిఘటించడంతో జేబులో దాచిన కత్తిని బయటకు తీశాడు. ఐశ్వర్య గొంతు కోశాడు. దీంతో తీవ్ర రక్తస్రావంతో ఆమె మరణించింది.
మరోవైపు ప్రశాంత్ కూడా అదే కత్తితో తన గొంతు కోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడు కూడా అక్కడే చనిపోయాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. ఇద్దరి మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.