Mark Tully : ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ మార్క్ టుల్లీ (90) కన్నుమూశారు. ఢిల్లీలోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో ఆయన తుదిశ్వాస విడిచారు. 1960ల నుంచి ఆయన జర్నలిస్టుగా సేవలందించారు. అంతర్జాతీయ మీడియా సంస్థ బీబీసీలో న్యూఢిల్లీ బ్యూరో చీఫ్‌గా రెండు దశాబ్దాలకుపైగా సేవలందించారు. రచయితగానూ సత్తా చాటారు. అక్టోబర్ 24, 1935న కోల్‌కతాలో జన్మించిన విలియం మార్క్ టుల్లీ పాతికేళ్ల వయసులో.. అంటే 1960లో బీబీసీలో చేరారు.
ఢిల్లీ బ్యూరోగా పని చేశారు. దక్షిణాసియాకు సంబంధించిన అనేక అంశాలతోపాటు చారిత్రక, రాజకీయ నేపథ్యం ఉన్న వార్తల్లో తనదైన ముద్రవేశారు. దేశాన్ని కుదిపేసిన ఆపరేషన్ బ్లూ స్టార్ (1984)పై ఆయన విశ్లేషణాత్మక కథనాలు అందించారు. బీబీసీ రేడియోలోనూ సేవలందించారు. ‘సంథింగ్ అండర్స్టుడ్’ కార్యక్రమాన్ని నిర్వమించారు. ఫారిన్ కరస్పాండెంట్‌గా జాతీయ, అంతర్జాతీయ అంశాలను బీబీసీ ద్వారా ప్రజలకు అందించారు. బీబీసీ సంస్థకు ఇండియా తరఫున బ్యూరో చీఫ్‌గా అత్యధిక కాలం సేవలందించి ఆయనే. మరోవైపు రచయితగానూ సత్తా చాటారు. నో ఫుల్ స్టాప్స్ ఇన్ ఇండియా, ఇండియా ఇన్ స్లో మోషన్, ద హార్ట్ ఆఫ్ ఇండియా వంటి పుస్తకాలు రచించారు.
రచయితగా, జర్నలిస్టుగా ఆయన అందించిన సేవలకు పలు జాతీయ, అంతర్జాతీయ పురస్కారాలు దక్కాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఆయనకు 1992లో పద్మశ్రీ పురస్కారం దక్కగా, 2005లో పద్మభూషణ్ పురస్కారం దక్కింది. 2002లో నైట్‌హుడ్ పురస్కారాన్ని కూడా అందుకున్నారు. టుల్లీ మృతికి పలువురు రాజకీయ నేతలు, జర్నలిస్టులు సంతాపం ప్రకటిస్తున్నారు.