Runa Mafi | ఛత్రపతి శంభాజీ నగర్: బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతుల ఆత్మహత్యలు ఆగడం లేదు. ముఖ్యంగా మరాఠ్వాడా ప్రాంతంలో అన్నదాతల ఆత్మహత్యలు ఏటికేడు పెరుగుతున్నాయి. ఈ ఏడాది మొదటి త్రై మాసికంలో ఈ ప్రాంతంలో 269 మంది అన్నదాతలు ఆత్మహత్య చేసుకున్నారు. నిరుడు మొదటి మూడు నెలల్లో ఈ సంఖ్య 204గా ఉంది. తక్కువ వర్షపాతం, రుతు పవన వైవిధ్యం వల్ల నీటి కొరత కలిగిన మరాఠ్వాడాను పాక్షిక శుష్క ప్రాంతంగా పరిగణిస్తారు.
మాజీ ఎంపీ, షేత్కారీ(రైతు) సంఘటన అధ్యక్షుడు రాజు షెట్టి మాట్లాడుతూ.. మహాయుతి సర్కారు నిరుడు ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన రైతు రుణ మాఫీ హామీని అమలు చేయకపోవడం రైతుల బలవన్మరణాలకు ఒక కారణమన్నారు. ‘ఇది రైతులను మోసం చేయడమే. రుణ మాఫీ కాకపోవడంతో చిన్న, సన్నకారు రైతులు ప్రాణాలు తీసుకుంటున్నారు’ అని షెట్టి అన్నారు.
సగటున ఒక హెకార్ట్కు వచ్చే పత్తి, సోయాబీన్ దిగుబడి శాతం తగ్గిపోయిందని.. మరోవైపు సాగు ఖర్చులు పెరిగిపోయాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత సీజన్లో రైతులు కనీస మద్దతు ధర కంటే తక్కువగా క్వింటాల్ సోయాబీన్‌ను రూ.1200 అమ్ముకోవాల్సి వచ్చిందని.. రైతులందరికీ రూ.8,500 కోట్ల నష్టం వచ్చిందని ఆయన వెల్లడించారు.