ముంబై: మరాఠా రిజర్వేషన్ల ఉద్యమం జోరుగా సాగుతున్నది. విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలంటూ మహారాష్ట్రలోని జాల్నా జిల్లాలో గత ఐదు రోజులుగా సాగుతున్న ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. శనివారం అంబాద్ ప్రాంతంలో నిరసనకారులు ఓ లారీకి నిప్పుపెట్టారు. కొన్ని వాహనాలను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటుచేసుకున్నది. దీంతో నిరసనకారులు రాళ్లు రువ్వడంతో జాల్నా ఎస్పీతోపాటు పలువురు పోలీసులకు గాయాలయ్యాయి. పరిస్థితి తీవ్రంగా మారడంతో పోలీసులు గాలిలోకి రబ్బరు బుల్లెట్లను కాల్చారు. ఆగ్రహించిన ఆందోళనకారులు పోలీసుల వాహనాలను ధ్వంసం చేశారు. అయితే శుక్రవారం రాత్రి జరిగిన భారీ లాఠీచార్జిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. శివసేన నాయకుడు సంజయ్‌రౌత్ మాట్లాడుతూ ‘నిరసనకారులు ఏ తప్పు చేశారని లాఠీచార్జి చేయాలని హోంమంత్రి ఫడ్నవీస్ ఆదేశించారు’ అని పేర్కొన్నారు. ఎన్సీపీ నేత శరద్ పవార్ స్పందిస్తూ సమస్యను సామరస్యంగా పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు.‘లాఠీచార్జి ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాను’ అని సీఎం ఏక్నాథ్ షిండే ట్వీట్ చేశారు. జల్నాలో హింసకు పాల్పడ్డారని ఆరోపిస్తూ 360 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు.
విద్యా, ఉద్యోగాల్లో చాలా వెనుకబడ్డామని, తమకు రిజర్వేషన్లు కల్పించాలని మరాఠా ఉద్యమ నేతలు కొన్ని ఏండ్ల నుంచి పోరాడుతున్నారు. అధికార బీజేపీ మభ్యపెడుతున్నదని గ్రహించిన మరాఠాలు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు.