ముంబై, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : ఓబీసీలకు లభ్యమయ్యే రిజర్వేషన్ ప్రయోజనాలకు అర్హులయ్యే కున్బీ కుల సర్టిఫికెట్లను అర్హులైన మరాఠాలకు ఇవ్వడంతోసహా అన్ని డిమాండ్లను మహారాష్ట్ర ప్రభుత్వం అంగీకరించడంతో మరాఠా హక్కుల నాయకుడు మనోజ్ జరాంగే మంగళవారం తన ఐదురోజుల నిరాహార దీక్షను విరమించారు.
ఆగస్టు 29న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో తన నిరశన దీక్షను ప్రారంభించిన జరాంగేకు రాష్ట్ర బీజేపీ సీనియర్ మంత్రి, మరాఠా రిజర్వేషన్‌పై క్యాబినెట్ ఉప సంఘం చైర్మన్ రాధాకృష్ణ విఖే పాటిల్ నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపచేశారు. 43 ఏళ్ల జరాంగే తన దీక్ష ఫలప్రదం అయినందుకు కంటతడి పెట్టుకోగా ఆయన మద్దతుదారులు హర్షధ్వానాలు చేశారు. అనంతరం జరాంగే వైద్య చికిత్స నిమిత్తం అంబులెన్సులో అక్కడి నుంచి బయల్దేరి వెళ్లారు.