బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లో వరుస ఎన్కౌంటర్లు (Encounter) జరుగుతున్నాయి. ఇటీవల కాంకేర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో 29 మంది మరణించగా, తాజాగా బీజాపూర్‌లో జరిగిన ఎన్కౌంటర్లో ఒకరు చనిపోయారు. ఆదివారం ఉదయం బీజాపూర్ జిల్లాలోని కేస్కుతుల్ అడవుల్లో మావోయిస్టులకు పోలీసులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఓ మావోయిస్టు మరణించాడని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నదని చెప్పారు.
ఈ నెల 16న కాంకేర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు అగ్రనేత శంకర్రావు సహా 29 మంది మరణించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఘటనపై ఆ పార్టీ ఉత్తర్ బస్తర్ జోనల్ కమిటీ బ్యూరో మంగ్లీ పేరుతో మూడు పేజీల లేఖ విడుదలైంది. ఈ ఎన్కౌంటర్ పూర్తిగా అమానవీయమైనదని, నమ్మకద్రోహానికి తమ పార్టీ పీఎల్జీఏ సభ్యులు వీరమరణం పొందారని మావోయిస్టు పార్టీ పేర్కొన్నది. తమ పార్టీ గురించి పూర్తి వివరాలు తెలిసిన వాళ్ల నుంచి సమాచారం తెలుసుకొన్న భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని నాలుగు వైపుల నుంచి చుట్టుముట్టి దాడి చేశాయని తెలిపింది.
కాల్పుల్లో 12 మంది బుల్లెట్ గాయాలతో మృతిచెందారని, మిగతా 17 మందిని పోలీస్ బలగాలు పలు విధాలుగా హింసించి, తుపాకులతో కాల్చి హతమార్చారని ఆరోపించింది. ఆదివాసీ సీఎం అయిన విష్ణుదేవ్ సాయి ఆదేశాలతోనే ఆదివాసీలు మరణించారని, ఈ నరమేధానికి ఛత్తీస్‌గఢ్‌లోని ప్రతి బీజేపీ నేతా జవాబుదారీనని పేర్కొన్నది. ప్రజా కోర్టులో వారికి తప్పక శిక్ష పడుతుందని హెచ్చరించింది. కాంకేర్ ఎన్కౌంటర్ ఘటనపై ప్రజా సంఘాలు నోరు విప్పాలని మావోయిస్టు పార్టీ తమ లేఖలో కోరింది. ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టులకు నివాళిగా ఈ నెల 25వ తేదీన నారాయణ్‌పూర్, కాంకేర్, మాన్పూర్-మోహ్లా జిల్లాల బంద్‌కు పిలుపునిస్తున్నట్లు ప్రకటించింది.