(స్పెషల్ టాస్క్ బ్యూరో)హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): అభివృద్ధిలో ‘గుజరాత్ మాడల్’ను ఆదర్శంగా తీసుకోవాలంటూ సుద్దులు చెప్పే బీజేపీ పెద్దలకు.. ఆ ‘మాడల్’ ఏపాటిదో ఆ రాష్ట్రంలోని పలు గ్రామాల ప్రజలు ముఖం మీద కొట్టినట్టు చెబుతున్నారు. ఏండ్లుగా రాష్ర్టాన్ని పాలిస్తున్న బీజేపీ.. తాగు, సాగునీటి వసతి కల్పించలేకపోయిందని, తమ బిడ్డలకు తగిన ఉపాధి అవకాశాలు చూపలేకపోయిందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ తీరుకు నిరసనగా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను మూకుమ్మడిగా బహిష్కరిస్తున్నట్టు తాజాగా ప్రకటించారు. ప్రభుత్వ పథకాలు తమకు రావడం లేదని మెహసానా జిల్లాలోని దావోల్, దహిసనానా, వారేత గ్రామాల్లోని ప్రజలు నిరసనలకు దిగారు. తమ భూములకు సాగునీటి వసతి లేకపోవడం వల్ల బంజరు భూములుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఉపాధి లేక యువకులు పట్టణాలకు వలస వెళ్ళిపోతున్నారని వాపోయారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ నిర్లక్ష్య, అసమర్థ వైఖరికి నిరసనగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్టు ఆయా గ్రామాల ప్రజలు తీర్మానించారు.
స్కూలు, డ్రైనేజీలు లేనేలేవు
తాగునీరు, మురుగునీటి వ్యవస్థ, పాఠశాల భవనం లేక అహ్మదాబాద్‌కు సమీపంలోని చిలోడా గ్రామస్థులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండేండ్ల క్రితమే అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్లో తమ గ్రామం విలీనమైనప్పటికీ, ప్రభుత్వం ఇంకా కనీస సౌకర్యాలు కల్పించలేదని గ్రామస్థులు మండిపడ్డారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు వీధుల్లో పోస్టర్లు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. బీజేపీ ప్రభుత్వ వ్యతిరేకతను ఎన్నికల బహిష్కరణ నిర్ణయం ప్రతిబింబిస్తుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే రానున్న ఎన్నికల్లో ఓటమి భయం పట్టుకొన్న బీజేపీకి తాజా పరిణామం మింగుడు పడటం లేదు. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాకూ గుజరాతే స్వరాష్ట్రం కావడంతో ఈ ఎన్నికలు జీవన్మరణ సమస్యగా తయారయ్యాయి. మోర్బీ జిల్లాలోని గజాడి గ్రామస్తులు మంచినీటి కొరత వల్ల 2017లో అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించారు. జామ్ నగర్ జిల్లాలోని ధాంగోర్, డాంగ్ జిల్లాలోని దావ్లాద్ గ్రామాలూ గత ఎన్నికలను బహిష్కరించాయి.
వసతుల కల్పనలో తెలంగాణ భేష్
పారిశుధ్యం, తాగునీటి వసతి, ప్రాథమిక సౌకర్యాల కల్పన, స్వచ్ఛ భారత్ మిషన్, గ్రామీణ విభాగంలో స్వచ్ఛ సర్వేతో ఇలా పలు విభాగాల్లో తెలంగాణ దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. ఏకంగా 12 అవార్డులు దక్కించుకున్నది. అటు పట్టణ విభాగంలో కూడా 16 మున్సిపాలిటీలు స్వచ్ఛ సర్వేక్షణ్-2022లో అవార్డులు పొందాయి. ప్రతిష్టాత్మక మిషన్ భగీరథ పథకంతో 100 శాతం ఇంటింటికీ నల్లా నీరందిస్తున్న రాష్ర్టాల్లో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది.