Drinking Water | నాసిక్: బీజేపీ పాలిత మహారాష్ట్రలో చాలా జిల్లాలు తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. ముఖ్యంగా నాసిక్ సహా విదర్భలోని పలు జిల్లాల్లో చాలా గ్రామాలు ఈ సమస్యను ఎదుర్కొంటున్నాయి. వేసవి ఇంకా విజృంభించక ముందే రాష్ట్రంలో చాలాచోట్ల నీటి వనరులు అడుగంటి పోయాయి. దీంతో మహిళలు మూడు, నాలుగు కిలోమీటర్ల దూరం నుంచి ఇండ్లకు నీళ్లను మోసుకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
నాసిక్ జిల్లా బొరిచివరి గ్రామ మహిళలైతే గుక్కెడు నీళ్ల కోసం ఎండిపోయిన బావిలోకి ప్రమాదకరంగా తాడు సాయంతో దిగుతున్నారు. నీళ్ల కోసం పోరాటం తమకు నిత్య కృత్యమైందని వారు వాపోతున్నారు. అధికారులకు సమస్యను పరిష్కరించాలని ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. యావత్మల్లోని పార్థీ తెగ మహిళలూ ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు రాష్ట్రంలో తాగునీటి సమస్యపై విపక్ష కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడింది. జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి నల్లా ద్వారా మంచినీరు అందిస్తామన్న మోదీ ప్రభుత్వం మాటలు పోస్టర్లకే పరిమితయ్యాయని విమర్శించింది.