న్యూఢిల్లీ : కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం రాష్ట్రాల ఆరోగ్యశాఖ మంత్రులు, అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో టీకాలు కవరేజీని పెంచాలని, జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో రోజువారీ కేసులు పెరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆయన సమావేశమయ్యారు. కొవిడ్ మహమ్మారి ముప్పు ఇంకా ముగియలేదని, పాఠశాలలకు వెళ్లే పిల్లలకు టీకాలు వేయాలని సూచించారు. అదే సమయంలో వృద్ధులకు ప్రికాషనరీ డోస్ వేయడంతో పాటు జోనోమ్ సీక్వెన్సింగ్ను బలోపేతం చేయాలని కోరారు.
కరోనా కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండడం చాలా ముఖ్యమన్నారు. టెస్ట్, ట్రాక్, ట్రీట్మెంట్తో పాటు టీకాలు వేయడం, కొవిడ్ ప్రవర్తనా నియమావళికి కట్టుబడి ఉండడం వంటి వ్యూహాలను కొనసాగించడంతో పాటు పర్యవేక్షించడం అవసరమన్నారు. ఈ నెల ఒకటి నుంచి ప్రారంభమైన ప్రత్యేక డ్రైవ్ హర్ ఘర్ దస్తక్ 2.0 పురోగతిని వ్యక్తిగతంగా సమీక్షించాలని రాష్ట్రాల ఆరోగ్యమంత్రులను కోరారు.
12-17 సంవత్సరాల పిల్లందరికీ రెండు డోసుల టీకా వేసేందుకు అవసరమైన ప్రయత్నాలను వేగవంతం చేయాలన్నారు. టీకా రక్షణతో పిల్లలు పాఠశాలలకు హాజరుకావచ్చన్నారు. ఇదిలా ఉండగా.. దేశంలో ఇటీవల రోజువారీ కేసులు పెరుగుతున్న వస్తున్నాయి. వరుసగా మూడో రోజు దేశంలో 8వేలకుపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, మీజోరాం సహా పలు రాష్ట్రాల్లో రోజువారీ పాజిటివిటీ రేటు 5 నుంచి 10శాతం మధ్య ఉందని
ఆరోగ్యశాఖ వర్గాలు పేర్కొన్నాయి.