Manoj Jarange : మహారాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ డిమాండ్ ఎప్పటినుంచో ఉంది. ఇప్పుడీ అంశం మరోసారి తెరపైకి రానుంది. దీనికి కారణం మహారాష్ట్రలోని మరాఠా సమాజ్ లీడర్ మనోజ్ జరాంగే పాటిల్. రాష్ట్రంలో మరాఠా రిజర్వేషన్ అమలు చేయాలని కోరుతూ ఆయన శనివారం నుంచి నిరాహార దీక్ష ప్రారంభించనున్నారు. దీనిపై శుక్రవారం ఆయన ప్రకటన చేశారు. జల్నా జిల్లాలోని అతర్వాలి సారాతి అనే తన స్వగ్రామంలోనే మనోజ్ ఈ నిరాహార దీక్ష ప్రారంభించబోతున్నట్లు వెల్లడించారు.
ముంబై వచ్చి, అక్కడే దీక్ష చేస్తానని ఆయన గతంలో వెల్లడించారు. అయితే, ఇప్పుడు తన ఊరి నుంచే దీక్ష ప్రారంభిస్తానని చెప్పారు. శనివారం ఉదయం 9.00 గంటల నుంచి ఈ దీక్ష ప్రారంభమవుతుందన్నారు. ప్రస్తుతం మరాఠా రిజర్వేషన్ అంశంపై మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరుగుతున్నాయని, తమ డిమాండ్లు నెరవేరకపోతే ఉద్యమం ముంబైకి చేరుతుందని హెచ్చరించారు. గత బుధవారం మనోజ్ మీడియాతో మాట్లాడుతూ.. తాను ముంబైలో దీక్ష చేస్తే 80 లక్షల నుంచి 90 లక్షల మంది యువత దీక్షకు హాజరవుతారన్నారు.
అంతేకాదు.. రైళ్లను ఆపేస్తామని, చివరకు విమానాల్ని కూడా ఎగరనీయమని హెచ్చరించారు. ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అయితే, తనకు ముంబైలో దీక్ష చేయాలన్న ఆసక్తి లేదన్నారు. మరాఠా తెగకు చెందిన వారు మాత్రం తన ఆందోళనకు సిద్ధంగా ఉండాలని, అవసరమైతే ముంబై వరకు మార్చ్ నిర్వహిస్తామన్నారు. మరోవైపు కున్బి తెగ వారికి కుల ధృవీకరణ పత్రాలు మంజూరు చేయడంలో ప్రభుత్వం అలసత్వం వహిస్తోందని, వారి సంఖ్యను తగ్గించేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తాము చట్టాన్ని అనుసరిస్తామని, కానీ, అవసరమైతే ముంబై వస్తామని, తమను ఎవరూ ఆపలేరని మనోజ్ వ్యాఖ్యానించారు.