‘బ్లాక్‌బస్టర్ ‘డీజే టిల్లు’ తర్వాత దర్శకుడు విమల్‌కృష్ణ చేస్తున్న సినిమా ఇది. అంతపెద్ద హిట్ తర్వాత ఆయనకు పెద్ద హీరో దొరకుతాడు. కానీ ఆయన నాపై నమ్మకంతో ఈ సినిమా చేశారు. తొలికాపీ చూసుకున్న తర్వాత ఆయన నమ్మకాన్ని నిలబెట్టాననే సంతృప్తి కలిగింది’ అని హీరో రాగ్ మయూర్ అన్నారు. ఆయన కథానాయకుడిగా రూపొందిన కామెడీ థ్రిల్లర్ ‘అనుమాన పక్షి’. ‘డీజే టిల్లు’ఫేం విమల్ కృష్ణ దర్శకుడు. రాజీవ్ చిలక, రాజేశ్ జగ్తియాని, హిరాచంద్ దండ్ నిర్మాతలు. ఈ నెల 25న సినిమా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా రాగ్ మయూర్ సోమవారం విలేకరులతో మాట్లాడారు. ‘విమల్‌కృష్ణ ట్రెండ్ ఫాలోకారు. ‘డీజే టిల్లు’ పార్ట్ 2 కూడా ఆయన అందుకే చేయలేదు. ‘అనుమాన పక్షి’ పూర్తి భిన్నమైన సినిమా. కాకపోతే ఇదికూడా ‘డీజే టిల్లు’ లాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది. డీజే టిల్లు, జాతిరత్నాలు ఊహించని విజయాలు సాధించాయి. ఈ సినిమా కూడా అలాంటి మ్యాజిక్కే చేస్తుందని నా నమ్మకం’ అని ఆశాభావం వెలిబుచ్చారు రాగ్‌మయూర్. ‘వినోదంతో మొదలై, మిస్టరీ జానర్లోకి ఎంటరై హారర్, థ్రిల్లర్ అంశాలతో ఈ సినిమా సాగుతుంది. ఇందులో హీరో తన అనుమానాలతో అందర్నీ పిచ్చెక్కిస్తుంటాడు. ఇంతమంచి పాత్ర ఇచ్చిన విమల్కృష్ణకు థ్యాంక్స్’ అని తెలిపారు రాగ్ మయూర్.