Manipur | ఇంఫాల్, జూలై 4: మణిపూర్ సంక్షోభానికి ప్రభుత్వమే కారణమని, రాష్ట్రంలో కొనసాగుతున్న హింసకు బీజేపీ సర్కార్ మద్దతు ఉన్నదని, వెనుకుండి అంతా నడిపిస్తున్నదని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ వుమెన్(ఎన్ఎఫ్ఐడబ్ల్యూ) ఆరోపించింది. మణిపూర్‌లో వాస్తవ పరిస్థితులను తెలుసుకొనేందుకు సీపీఐ అనుబంధ ఎన్ఎఫ్ఐడబ్ల్యూ బృందం రాష్ట్రంలో ఇటీవల పర్యటించింది.
ఎన్ఎఫ్ఐడబ్ల్యూ ప్రధాన కార్యదర్శి సోమవారం మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో 2017లో ప్రారంభమైన పెట్రోలియం అన్వేషణకు, తాజాగా జరుగుతున్న హింసకు సంబంధం ఉన్నదని అనుమానం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ఫాసిస్ట్ ప్రభుత్వం దాచిపెట్టిన తన కార్పొరేట్ అనుకూల ఎజెండాకు కార్యరూపం దాల్చేందుకు వ్యూహం పన్నిందని, అది ప్రస్తుత సంక్షోభానికి దారితీసిందని ఆరోపించారు. సహాయక క్యాంపుల్లో పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని తెలిపింది.
చురాచాంద్‌పుర్ జిల్లాలో సోంగ్పిలోని కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ అధికార ప్రతినిధి సీలెన్ హాకిప్ ఇంటికి కొంతమంది గుర్తుతెలియని దుండగులు సోమవారం నిప్పుపెట్టారు.
మరోవైపు తౌబల్ జిల్లాలో ఖంగాబక్ ఏరియాలోని ఇండియన్ రిజర్వ్డ్ బెటాలియన్(ఐఆర్బీ) క్యాంపు నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రిని లూటీ చేసేందుకు కొంత మంది సాయుధ దుండగులు యత్నించారు.