Manipur | ఇంఫాల్, సెప్టెంబర్ 21: మణిపూర్‌లో మళ్లీ హింస చెలరేగింది. భద్రతా బలగాలు ఐదుగురు యువకుల్ని అరెస్టు చేయటాన్ని నిరసిస్తూ ఇంఫాల్‌లో ఆందోళనకారులు గురువారం పోలీస్ స్టేషన్లను చుట్టుముట్టారు. ఇంఫాల్ తూర్పు, పశ్చిమ జిల్లాల్లో ఆందోళనకారుల్ని చెదరగొట్టేందుకు పోలీసులు కాల్పులకు దిగారు. లాఠీచార్జ్ జరిపి.. టియర్‌గ్యాస్ ప్రయోగించారు. ఈ ఘటనల్లో 50 మందికిపైగా గాయపడ్డారు. సింజామె పోలీస్ స్టేషన్ వద్ద పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్నది.
రాజధాని ఇంఫాల్‌లో కర్ఫ్యూని తిరిగి అమల్లోకి తీసుకొస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వం లోయలో భద్రతా బలగాల్ని పెద్ద సంఖ్యలో మోహరించింది. ఆందోళనకారులు చేపట్టిన ర్యాలీలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ప్లకార్డులు ప్రదర్శిస్తూ, అరెస్టుకు నిరసనగా నినాదాలు చేశారు. పోలీస్ స్టేషన్ల ముందు బైఠాయించి యువకుల్ని వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భద్రతా బలగాలు ధరించే దుస్తుల్ని వేసుకున్న ఐదుగురు యువకుల్ని ఈ నెల 16న పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద అధునాతన ఆయుధాలున్నాయని పేర్కొన్నారు. అయితే వారు విలేజ్ వలంటీర్లని స్థానికులు చెబుతున్నారు. ఈ అరెస్టులపై ఇంఫాల్ లోయ అట్టుడుకుతున్నది. సోమవారం అనధికారిక సమ్మె చేపట్టగా, పలు సంఘాలు 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చాయి.