Manipur | ఇంఫాల్, జూలై 24: ‘కాల్పుల శబ్ధం వింటే భయమేస్తున్నది. చర్చి గంట మోగితే వణుకు వస్తున్నది. కాల్పుల శబ్దం వినిపించడంతో చనిపోతానేమోనన్న భయంతో చాలాసేపు ఏడ్చా. ఇప్పటికీ హింసాత్మక ఘటనలను తలచుకుంటే ఒళ్లు జలదరిస్తున్నది’ అంటూ మణిపూర్‌లో తాను ఎదుర్కొన్న భయానక ఘటనల గురించి ఏడేండ్ల బాలిక లింగ్జోకిమ్ హావోకిప్ చేసిన వ్యాఖ్యలివి. ఆ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులకు ఆ చిన్నారి మాటలే నిదర్శనం. హింస మాటున మణిపూర్‌లో జరుగుతున్న దారుణాలు అన్నీఇన్నీ కావు. మరో బాలిక లింగ్నున్నెమ్ హావోకిప్ అక్కడి పరిస్థితులను వివరించింది.
‘చర్చి గంట మోగింది. ప్రజలు భయంతో అరుస్తూ పరుగులు తీస్తున్నారు. కొంతమంది ఆందోళనకారులు అక్కడికి వచ్చారు. చర్చి పరిసరాలు ఒక్కసారిగా కాల్పులతో మోతమోగాయి. నేను చాలా భయపడ్డాను. ఏడ్వకుండా ఉండేందుకు ప్రయత్నించా. కానీ మా చెల్లి రాత్రంతా ఏడుస్తూనే ఉన్నది’ మే 3న మణిపూర్‌లో జరిగిన ఘటనను తొమ్మిదేండ్ల లింగ్నున్నెమ్ హావోకిప్ తెలిపింది. ఆ రాష్ట్రంలో నెలకొన్న హింసాత్మక ఘటనలు పెద్దలతో పాటు అభంశుభం తెలియని చిన్నారులను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఇప్పటివరకు సుమారు 100 మందికి పైగా బాలలు ప్రాణాలు కోల్పోయారు.
తన తల్లి, బంధువుతో పాటు దవాఖానకు వెళ్తున్న టాంగ్సింగ్ హాన్సింగ్ అంబులెన్స్‌కు మిలిటెంట్లు నిప్పు పెట్టడంతో సజీవ దహనం అయిన విషయం తెలిసిందే. కాగా, చాలామంది తమ ఇండ్లను వదిలి పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. భవిష్యత్తుపై ఆశలు కోల్పోయిన ఆ చిన్నారులు… ఊహ తెలియని వయసులోనే తాము ఎదుర్కొంటున్న భయానక ఘటనల వల్ల భయం భయంగా బాల్యాన్ని గడుపుతున్నారు. తమకు ఎదురైన అనుభవాలను వారు పంచుకున్నారు. తన మేనకోడళ్లు ఎదుర్కొన్న భయానక అనుభవాలను పాటిన్మాంగ్ సుంతక్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశారు.