Manickam Tagore : నీతి ఆయోగ్ సమావేశంలో పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని అవమానించిన తీరు అత్యంత దురదృష్టకరమని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాగూర్ అన్నారు. పార్లమెంట్లో విపక్ష నేతల మైక్ కట్ చేయడం ఇప్పటివరకూ చూశామని, ఇక నీతి ఆయోగ్ సమావేశంలోనూ సీఎంల మైక్‌లు కట్ చేయడం వరకూ కాషాయ పాలకులు వెళ్లడం సిగ్గుచేటని ఆయన వ్యాఖ్యానించారు.
మైక్ ఆపేస్తే అందరూ మౌనం దాల్చుతారని బీజేపీ పాలకులు అనుకుంటున్నారని, కానీ దేశ ప్రజలు ఇదంతా గమనిస్తున్నారనేది కాషాయ పాలకులు గుర్తెరగాలని ఆయన హితవు పలికారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన శనివారం న్యూఢిల్లీలో జరిగిన నీతి ఆయోగ్ సమావేశం నుంచి పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.
నీతి ఆయోగ్ సమావేశం నుంచి బయటకు వచ్చిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ తాను మాట్లాడటం ప్రారంభించిన ఐదు నిముషాల తర్వాత తన మైక్రోఫోన్‌ను ఆపేశారని, అదే సమయంలో మిగతా సీఎంలు చాలాసేపు ప్రసంగించడానికి అనుమతి ఇచ్చారని తెలిపారు. ‘ఇది చాలా అవమానకరం. ఇక ముందు జరిగే సమావేశాలకు హాజరు కాబోను’ అని ఆమె స్పష్టం చేశారు. ఇక నీతి ఆయోగ్ సమావేశానికి బీహార్, తమిళనాడు, పుదుచ్చేరి, కేరళ, పంజాబ్, తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రులు హాజరు కాలేదు.
Read More :
Road Damage | గోషామహల్లో కుంగిన రోడ్డు..బోల్తా పడిన డీసీఎం : వీడియో