న్యూఢిల్లీ: భార్యాభర్తలు గొడవపడ్డారు. అయితే పొరుగింటి వ్యక్తి జోక్యం చేసుకున్నాడు. దీంతో ఆగ్రహించిన భర్త అతడి తలపై ఇనుప రాడ్‌తో కొట్టాడు. మెట్లపై నుంచి కిందపడిన ఆ వ్యక్తి తలకు తీవ్ర గాయం కావడంతో మరణించాడు. (Man Killed In Couple’s Fight) దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. నవంబర్ 13న ఇంటి విషయంపై తన భార్యతో ధీరజ్ గొడవపడ్డాడు. ఆమెను దుర్భాషలాడటంతోపాటు కొట్టాడు.
కాగా, పొరుగున నివసించే 42 ఏళ్ల రన్ సింగ్ జోక్యం చేసుకున్నాడు. భార్యను తిట్టి కొడుతున్న ధీరజ్ ప్రవర్తనపై అభ్యంతరం వ్యక్తం చేశాడు. అతడ్ని అడ్డుకునేందుకు ప్రయత్నించాడు. ఆగ్రహించిన ధీరజ్ ఐరాన్ రాడ్‌తో రన్ సింగ్ తలపై కొట్టాడు. దీంతో అతడు మెట్ల పైనుంచి కింద పడ్డాడు.
మరోవైపు తలకు తీవ్ర గాయమైన రన్ సింగ్‌ను కుటుంబ సభ్యులు వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. నిందితుడు ధీరజ్‌ను అరెస్ట్ చేశారు. హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.