భువనేశ్వర్: అతనికి ఫేస్బుక్లో (Facebook) ఓ అమ్మాయి పరిచయం అయింది. వారిద్దరి మధ్య మెసేజ్లు నడిచాయి. కొన్ని రోజుల తర్వాత ఆమెను చూడాలనిపించింది. ఇకేముంది అనుకున్నదే ఆలస్యం 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆమె ఊరికి వెళ్లాడు. వాళ్ల కుటుంబ సభ్యులకు దొరికిపోవడంతో కట్టేసి కొట్టారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని (Madhya Pradesh) మౌగంజ్ జిల్లా పిప్రాహీలో చోటుచేసుకున్నది.
వైకుంఠ్పూర్ గ్రామానికి చెందిన ఓ యువకుడికి మౌగంజ్ జిల్లా పిప్రాహీలో ఉండే ఓ మైనర్ బాలిక ఫేస్బుక్లో పరిచయం అయింది. ఇద్దరి మధ్య స్నేహం చిగురించింది. రోజూ చాటింగ్ చేసుకునేవారు. దీంతో అతడికి ఆ బాలికని చూడాలని ఆశపుట్టింది. దీంతో తానుంటున్న ప్రాంతం నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ అమ్మాయి ఇంటికి శనివారం రాత్రి చేరుకున్నాడు. ఈ క్రమంలో బైనర్ బాలిక కుటుంబ సభ్యులకు దొరికపోయాడు. అతని చేతులు, కాళ్లు కట్టేసిన వారు.. శనివారం రాత్రి 9 నుంచి ఆదివారం ఉదయం 10 గంటల వరకు 13 గంటల పాటు కొట్టారు. ఆ సమయంలో వీడియోలు, ఫొటోలు కూడా తీశారు. వాటిని సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్ అయ్యాయి. విషయం కాస్తా పోలీసుల దృష్టికి వెళ్లడంతో వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ ఘటనపై పూర్తి సమాచారం సేకరించాలని జిల్లా ఎస్పీ ఆర్ఎస్ ప్రజాపతి సంబంధిత పోలీసు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే ఇప్పటి వరకు తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని వెళ్లడించారు.