నాగ్‌పూర్: ట్రక్ ఢీకొనడంతో తన భార్య చనిపోతే సాయం కోసం ఓ వ్యక్తి చేసిన ఆక్రందనను ఎవరూ పట్టించుకోలేదు. చివరికి అతడు తన భార్య మృతదేహాన్ని తన బైక్‌కు కట్టి తీసుకెళ్లిన హృదయ విదారక ఘటన మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో చోటుచేసుకున్నది. రక్షా బంధన్ రోజున, ఈ నెల 9న నాగ్‌పూర్-జబల్పూర్ హైవే మీద ఈ ఘటన జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. బాధిత జంట అమిత్ యాదవ్-గ్యార్సి నాగ్‌పూర్‌లోని లోనా నుంచి మధ్యప్రదేశ్‌లోని కరణ్‌పూర్‌కు వెళుతుండగా వేగంగా వెళుతున్న ట్రక్ ఒకటి మోర్ఫతా వద్ద వారిద్దరిని ఢీ కొట్టింది. గ్యార్సి రోడ్డు మీద పడి చనిపోయారు. ట్రక్ డ్రైవర్ ఆగకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అమిత్ తన భార్య శవాన్ని తరలించడానికి సాయం చేయాలని బాటసారులను, వాహనదారులను వేడుకున్నా.. ఎవరూ ముందుకు రాలేదు. దీంతో అతడు భార్య మృతదేహాన్ని బైక్‌కు కట్టుకొని మధ్యప్రదేశ్‌లోని స్వగ్రామానికి బయలుదేరాడు. కొంతసేపటికి అతడిని అనుసరించిన పోలీసులు బాధితురాలి మృతదేహాన్ని శవ పరీక్ష కోసం తరలించారు.