లక్నో: భార్యను గన్‌తో కాల్చి భర్త హత్య చేశాడు. అయితే అదే బుల్లెట్ తగిలి అతడు కూడా మరణించాడు (couple died from single bullet). ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 40 ఏళ్ల అనేక్ పాల్, 38 ఏళ్ల సుమన్ పాల్ భార్యాభర్తలు. చండీగఢ్‌లో రోజువారీ కూలీగా పనిచేసిన వారిద్దరూ ఇటీవల స్వస్థలమైన ఖాన్పూర్ గ్రామానికి తిరిగి వచ్చారు. అయితే భార్యాభర్తలిద్దరూ తరచుగా గొడవ పడేవారు. ఈ నేపథ్యంలో ఈ నెల 13న అర్థరాత్రి వేళ అనేక్ పాల్ పూజలు చేశాడు. ఆ తర్వాత భార్య సుమన్‌ను కౌగిలించుకుని ఆమె వెనుక నుంచి తుపాకీతో కాల్పులు జరిపాడు. అయితే ఆ బుల్లెట్ అనేక్ పాల్ శరీరం నుంచి కూడా దూసుకెళ్లింది. గాయపడిన భార్యాభర్తలను బంధువులు ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. వారిద్దరూ చనిపోయారు. ఒక కుమార్తె, ముగ్గురు కుమారులైన వారి నలుగురు పిల్లలు అనాథలయ్యారు.
కాగా, ఈ సంఘటనపై బంధువుల నుంచి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. గత వారం ఒక పెళ్లి వేడుకలో భార్య సుమన్ మొబైల్ చోరీ అయ్యిందని చెప్పారు. నాటి నుంచి భార్యాభర్తల మధ్య తీవ్ర స్థాయిలో ఘర్షణ జరుగుతున్నట్లు బంధువుల ద్వారా తెలిసిందన్నారు. అయితే భార్యను చంపేందుకు నాటు తుపాకీని భర్త ఎలా కలిగి ఉన్నాడు? అర్థరాత్రి వేళ అతడు ఎందుకు పూజలు చేశాడు? అన్నదానిపై దర్యాప్తు జరుపుతామని పోలీస్ అధికారి తెలిపారు. అనాథలైన నలుగురు పిల్లలను తమకు అప్పగించమని అమ్మ తరుఫు కుటుంబం వారు కోరుతున్నట్లు చెప్పారు. నిబంధనల ప్రకారం వ్యవహరించి దీనిపై తగిన నిర్ణయం తీసుకుంటామని పోలీస్ అధికారి వెల్లడించారు.