BJP MLA | భోపాల్, జూలై 4: మధ్యప్రదేశ్‌లోని సిధి జిల్లాలో మాటల్లో చెప్పలేని అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి ఓ అమాయక గిరిజన యువకుడిపై మూత్రవిసర్జనకు పాల్పడి పైశాచిక ఆనందాన్ని పొందాడు. ఈ ఘటనపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్నది. నిందితుడు బీజేపీకి చెందినవాడేనని, సిధి ఎమ్మెల్యే కేదార్నాథ్ శుక్లాకు అత్యంత సన్నిహితుడని ఆరోపణలు వెలువడుతున్నాయి. దీంతో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ నేతృత్వంలోని బీజేపీ సర్కార్‌పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
మూత్ర విసర్జనకు పాల్పడిన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. ‘నిందితుడు ప్రవేశ్ శుక్లాగా గుర్తించాం. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదుచేశాం. అంతేగాక జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కఠిన చర్యలు తీసుకుంటాం’ అని సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ట్విట్టర్లో వెల్లడించారు.