న్యూఢిల్లీ: కుంభమేళాకు (Maha Kumbh) వెళ్లేందుకు ఖర్చుల కోసం ఒక వ్యక్తి మూడు ఇళ్లల్లో చోరీలు చేశాడు. బంగారు ఆభరణాలు, ఖరీదైన వస్తువులను దొంగిలించాడు. బాధితుల ఫిర్యాదులపై దర్యాప్తు చేసిన పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. అరవింద్ అలియాస్ భోలా తన స్నేహితులతో కలిసి ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు వెళ్లాలని భావించాడు. ప్రయాణ ఖర్చులకు కావాల్సిన డబ్బు కోసం చోరీలకు పాల్పడ్డాడు. జనవరి 17న దబ్రిలోని రాజ్‌పురి ప్రాంతంలో మూడు ఇళ్లల్లో దొంగతనాలు చేశాడు. ఖరీదైన వస్తువులు, నగలను అపహరించాడు.
కాగా, మూడు ఇళ్లల్లో జరిగిన దొంగతనాలపై బాధితులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దర్యాప్తు చేశారు. అరవింద్ అలియాస్ భోలాను నిందితుడిగా గుర్తించి అతడ్ని అరెస్ట్ చేశారు. పోలీసులు ప్రశ్నించగా స్నేహితులతో కలిసి కుంభమేళాకు వెళ్లేందుకు ఖర్చుల కోసం మూడు ఇళ్లల్లో దొంగతనాలకు పాల్పడినట్లు చెప్పాడు.
మరోవైపు అరవింద్‌పై ఇప్పటికే 16 దొంగతనం, దోపిడీ కేసులు నమోదయ్యాయని పోలీస్ అధికారి తెలిపారు. 2020లో అతడు తొలిసారి అరెస్ట్ అయ్యాడని చెప్పారు. పేదరికంతోపాటు డ్రగ్స్‌కు బానిసైన అతడు దొంగతనాలకు అలవాటుపడినట్లు వెల్లడించారు.