ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 17:07:06

క‌రోనా భ‌యం.. భార్య‌ను ఇంటికి రానివ్వ‌ని భ‌ర్త‌

క‌రోనా భ‌యం.. భార్య‌ను ఇంటికి రానివ్వ‌ని భ‌ర్త‌

బెంగ‌ళూరు : క‌రోనా పేరు విన‌గానే కొంద‌రైతే గ‌జ‌గ‌జ వ‌ణికిపోతున్నారు. క‌రోనా కేసులు న‌మోదైన ప్రాంతాల‌కు వెళ్లాలంటేనే జంకుతున్నారు. కనీసం అటు వైపు చూసేందుకు కూడా ఇష్ట‌ప‌డ‌టం లేదు. కంటైన్ మెంట్ జోన్ల ప‌రిధిలో ఉన్న ప్ర‌జ‌ల‌ను వేరే ప్రాంతాల్లోకి అనుమ‌తించ‌డం లేదు. ఓ భ‌ర్త కూడా క‌రోనా భ‌యంతో త‌న భార్య‌ను ఇంటికి రానివ్వ‌లేదు. 

బెంగ‌ళూరుకు చెందిన ఓ మ‌హిళ‌.. మూడు నెల‌ల క్రితం చండీఘ‌ర్ కు వెళ్లింది. లాక్ డౌన్ కార‌ణంగా ఆమె అక్క‌డే చిక్కుకుపోయింది. మ‌హిళ భ‌ర్త‌, ప‌దేళ్ల కుమారుడు మాత్రం బెంగ‌ళూరులోనే ఉండిపోయారు. అయితే ఇటీవ‌లే మ‌హిళ బెంగ‌ళూరుకు తిరిగొచ్చింది. 

కానీ భ‌ర్త ఇంటికి రానివ్వ‌క‌పోవ‌డంతో ఆమె తీవ్ర నిరాశ‌కు గురైంది. 14 రోజుల పాటు క్వారంటైన్ లో ఉండాల‌ని, కొవిడ్ నెగిటివ్ రిపోర్టు వ‌స్తేనే ఇంట్లోకి అనుమ‌తిస్తాన‌ని భార్య‌కు భ‌ర్త తెగేసి చెప్పాడు. మొత్తానికి క‌రోనా భ‌యంతో ఆమెను ఇంట్లోకి అడుగు పెట్ట‌నివ్వ‌లేదు భ‌ర్త‌. 

చేసేదేమీ లేక‌.. బాధితురాలు ప‌రిహార్ వ‌నిత స‌హాయ‌వాణి(వుమెన్స్ హెల్ప్ లైన్)ను సంప్ర‌దించింది. ఆ త‌ర్వాత ఆ స‌భ్యులంతా క‌లిసి భ‌ర్త ఇంటికి వెళ్లారు. అంతలోపే అక్క‌డ్నుంచి భ‌ర్త‌, కుమారుడు జారుకున్నారు. ఇలా అయితే లాభం లేద‌నుకున్న భార్య‌.. పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. పోలీసులు భ‌ర్త‌ను పిలిపించి.. ఇద్ద‌రికీ కౌన్సెలింగ్ ఇచ్చారు. క‌రోనాపై వారికి అవ‌గాహ‌న క‌ల్పించారు. అనంత‌ర భార్యాభ‌ర్త‌లిద్ద‌రూ త‌మ ఇంటికి వెళ్లారు. ప్ర‌స్తుతం ఆమె హోం క్వారంటైన్ లో ఉన్నారు.


logo