INCA 2026 | భారతీయ సినీ పరిశ్రమలో ప్రతిష్టాత్మకంగా భావించే ఇండియన్ నేషనల్ సినీ అకాడమీ (INCA) అవార్డ్స్ 2026 విజేతలను ప్రకటించారు. ప్రతి ఏడాది దేశంలోని పలు భాషల చిత్ర పరిశ్రమలను ఒక వేదికపైకి తీసుకువచ్చే ఈ అవార్డులు, ఈసారి కూడా విశేష ప్రాధాన్యం సంతరించుకున్నాయి. తెలుగు విభాగంలో యువసామ్రాట్ నాగచైతన్య ‘తండేల్’ సినిమాలో తన నటనకు గాను ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. అలాగే రష్మిక మందన్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ సినిమాతో ఉత్తమ నటిగా అవార్డు అందుకోనుంది. ఇప్పటికే ఈ ఇద్దరూ తెలంగాణ గద్దర్ అవార్డ్స్‌లో ఉత్తమ నటీనటులుగా గుర్తింపు పొందగా, ఇప్పుడు INCAలో కూడా అదే కేటగిరీలో విజేతలుగా నిలవడం విశేషం. ఇక తెలుగు విభాగంలో ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడి ‘సంక్రాంతికి వస్తున్నాం’ చిత్రానికి గాను ఎంపికయ్యారు. అదే సినిమాలో నటించిన మాస్టర్ రేవంత్ (బుల్లిరాజు)కు ఉత్తమ హాస్యనటుడిగా అవార్డు లభించింది.
హీరో తేజ సజ్జా నటించిన మిరాయ్ ఉత్తమ చిత్రంగా నిలిచింది. ఈ సినిమాకే బెస్ట్ విజువల్ ఎఫెక్ట్స్ విభాగంలోనూ అవార్డు రావడం విశేషం. ఉత్తమ తొలి చిత్ర దర్శకుడిగా రామ్ జగదీష్ (‘కోర్ట్’) ఎంపికయ్యారు. ఇతర భాషల్లో కూడా పలువురు ప్రముఖులు అవార్డులు సొంతం చేసుకున్నారు. తమిళంలో దుల్కర్ సల్మాన్ ఉత్తమ నటుడిగా, సిమ్రాన్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు. కన్నడలో రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రంతో ఉత్తమ నటుడు, దర్శకుడు అవార్డులు అందుకోగా, అదే సినిమా ఉత్తమ చిత్రంగా కూడా నిలిచింది. మలయాళంలో నివిన్ పౌలీ ఉత్తమ నటుడిగా నిలిచారు. హిందీలో రణవీర్ సింగ్ ఉత్తమ నటుడిగా, యామీ గౌతమ్ ఉత్తమ నటిగా ఎంపికయ్యారు.
ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం ఏప్రిల్ 16న ముంబైలో జరగనుంది. ఈ వేడుకకు టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి మరియు బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ హోస్టులుగా వ్యవహరించనున్నారు.సీనియర్ నటి రేఖ, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
ఉత్తమ నటుడు – నాగచైతన్య (‘తండేల్’)
ఉత్తమ నటి – రష్మిక (‘ది గర్ల్‌ఫ్రెండ్’)
ఉత్తమ దర్శకుడు – అనిల్ రావిపూడి (‘సంక్రాంతికి వస్తున్నాం’)
ఉత్తమ చిత్రం – ‘మిరాయ్’
ఉత్తమ హాస్యనటుడు – రేవంత్ (‘సంక్రాంతికి వస్తున్నాం’)
మొత్తంగా INCA 2026 అవార్డ్స్‌లో తెలుగు సినీ పరిశ్రమ మరోసారి తన ప్రతిభను చాటుకుంటూ, దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది.