భువనేశ్వర్: పోలీస్ అధికారిగా నమ్మించిన ఒక వ్యక్తి ఐదుగురు మహిళలను పెళ్లాడాడు. (Posing As Cop Man Marrys 5 Women) వారి నుంచి తీసుకున్న డబ్బుతో విలాసవంతమైన జీవితం గడిపాడు. మోసపోయిన ఇద్దరు మహిళల ఫిర్యాదుతో పోలీసులు ట్రాప్ చేసి అతడ్ని అరెస్ట్ చేశారు. ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లో ఈ సంఘటన జరిగింది. జాజ్‌పూర్ జిల్లాకు చెందిన 34 ఏళ్ల సత్యజిత్ సమల్ భువనేశ్వర్‌లో నివసిస్తున్నాడు. పోలీస్ అధికారిగా నమ్మించిన అతడు మ్యాట్రిమోనియల్ వెబ్సైట్ ద్వారా పలువురు మహిళలను సంప్రదించాడు. యువ వితంతువులు, విడాకులు పొందిన వారిని టార్గెట్ చేసేవాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి డబ్బు, కార్లు డిమాండ్ చేసేవాడు. డబ్బులు తిరిగి ఇవ్వాలని అడిగిన వారిని గన్‌తో బెదిరించేవాడు.
కాగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలుత ఒక మహిళ ఫిర్యాదు చేసింది. మ్యాట్రిమోనియల్ సైట్ ద్వారా సమల్‌తో పరిచయమైనట్లు ఆమె చెప్పింది. పెళ్లి సాకుతో తనను లొంగతీసుకున్నాడని, కారు కొనుగోలుకు డబ్బులు డిమాండ్ చేశాడని ఆరోపించింది. దీంతో బ్యాంకు నుంచి వ్యక్తిగత రుణం తీసుకుని రూ. 8.15 లక్షల విలువైన కారును కొని అతడికి ఇచ్చినట్లు చెప్పింది. వ్యాపారం ప్రారంభించడానికి రూ. 36 లక్షలు కూడా సమకూర్చినట్లు ఫిర్యాదులో పేర్కొంది.
మరోవైపు మరో మహిళ కూడా సమల్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్యాంకు రుణాలతో రూ. 8.60 లక్షలు నగదు, ఒక బైక్ కొని ఇచ్చినట్లు చెప్పింది. విచారణ జరిపిన పోలీసులు మహిళా అధికారిణి ద్వారా ట్రాప్ చేశారు. పెళ్లి కోసం ఆమెను కలిసేందుకు వచ్చిన అతడ్ని అరెస్ట్ చేశారు. సత్యజిత్ సమల్‌ను ప్రశ్నించగా ఐదుగురు మహిళలను పెళ్లాడినట్లు చెప్పాడు. ఒడిశాకు చెందిన ఇద్దరిని, కోల్‌కతా, ఢిల్లీకి చెందిన ఒక్కో మహిళను వివాహం చేసుకున్నట్లు మ్యారేజ్ సర్టిఫికెట్ల ద్వారా గుర్తించారు. అయితే ఐదో మహిళ వివరాలు తెలియలేదని చెప్పారు.
కాగా, పెళ్లి పేరుతో ఒక మహిళను మోసం చేసిన తర్వాత సత్యజిత్ సమల్ దుబాయ్‌కి పారిపోయేవాడని పోలీసులు తెలిపారు. మరో మహిళను లక్ష్యంగా చేసుకున్న తర్వాత భువనేశ్వర్‌కు తిరిగి వచ్చేవాడని చెప్పారు. అతడి నుంచి కారు, బైక్, రూ. 2.10 లక్షల నగదు, పిస్టల్, కొన్ని బుల్లెట్లు, రెండు వివాహ ఒప్పంద పత్రాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. పెళ్లి ప్రతిపాదనలపై మ్యాట్రిమోనియల్ సైట్లో మరో 49 మంది మహిళలతో అతడు సంభాషిస్తుంచినట్లు విచారణలో తేలిందన్నారు. సమల్ అరెస్ట్ విషయం తెలిసి మరింత మంది బాధిత మహిళలు ఫిర్యాదు చేసే అవకాశమున్నదని పోలీస్ అధికారి వెల్లడించారు.