బెంగళూరు: అతను స్టాక్ మార్కెట్ ట్రేడింగ్లో దిట్ట. ఏండ్లుగా లక్షల్లో పెట్టుబడులు పెడుతూ లాభాలు గడిస్తున్నాడు. అయితే, రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవుగా. ఇటీవల అతనికి కూడా చెడ్డరోజులు మొదలయ్యాయి. గత ఆరు నెలల నుంచి పెట్టిన పెట్టుబడి పెట్టినట్టే మాయమైపోయింది. దాచుకున్న సొమ్ము మొత్తం స్టాక్ మార్కెట్లో ధారపోశాడు. అయినా స్టాక్ ఇన్వెస్ట్మెంట్లపై అతనికి మోజు తగ్గడంలేదు. అప్పులు తెచ్చి మరీ పెట్టుబడులు పెడుతున్నాడు. అలా ఇప్పటి వరకు మొత్తం రూ.30 లక్షలు పోగొట్టుకున్నాడు. ఆఖరికి స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాలనే తన బలహీనత నుంచి బయటపడేందుకు డీ అడిక్షన్ సెంటర్ను ఆశ్రయించాడు.
కర్ణాటక రాజధాని బెంగళూరుకు చెందిన వ్యక్తి విషాద పరిస్థితి ఇది. డీ అడిక్షన్ సెంటర్లోని సైకాలజిస్టులు అతడిని రకరకాలుగా ప్రశ్నించి, అతని మానసిక పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చారు. గేమింగ్, ఆల్కహాల్ అడిక్షన్ కంటే ఈ స్టాక్ మార్కెట్ అడిక్షన్ కేసు తమకు చాలా భిన్నమైనదని చెప్పారు. అతడికి ఇకపై పూర్తిగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడుల ఆలోచన రాకుండా చేయలా.. లేదంటే పెట్టుబడులపై నియంత్రణ వచ్చేలా ట్రీట్మెంట్ ఇవ్వాలా అన్నది ఇప్పుడు తమ ముందున్న సవాల్ అన్నారు. బాధితుడికి ఇప్పటికే రెండు సిట్టింగ్లు పూర్తయ్యాయని, ట్రీట్మెంట్ కొనసాగుతుందని చెప్పారు.