కోయంబత్తూరు: భార్యపై అనుమానం పెంచుకున్న ఓ వ్యక్తి.. ఆమెను హత్యచేసి వాట్సాప్ స్టేటస్‌గా (WhatsApp Status) పెట్టుకున్న ఘటన తమిళనాడులోని కోయంబత్తూరులో (Coimbatore) చోటుచేసుకున్నది. తిరునల్వేలికి (Tirunelveli) చెందిన బాలమురుగన్, శ్రీప్రియ దంపతులకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వ్యక్తిగత కారణాల వల్ల గత కొంతకాలంగా ఇద్దరు విడిగా ఉంటున్నారు. శ్రీప్రియ కోయంబత్తూరులోని ఓ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ పనిచేసుకుంటున్నది.
ఈ క్రమంలో భార్యకు మరొకరితో వివాహేతర సంబంధంలో ఉందని బాలమురుగన్ అనుమానం పెంచుకున్నాడు. దీంతో ఆదివారం శ్రీప్రియ ఉంటున్న హాస్టల్‌కు వెళ్లిన బాలమురుగన్.. తనతోపాటు తిరిగి ఇంటికి రావాలని బలవంతం చేశాడు. అందుకు ఆమె నిరాకరించడంతో ఇద్దరిమధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది. ఘర్షణ తారాస్థాయికి చేరడంతో.. తనతో తెచ్చుకున్న కొడవలితో ఆమెపై దాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. అక్కడితో ఆగని బాలమురుగన్.. రక్తపు మడుగులో పడిఉన్న భార్య మృతదేహంతో సెల్ఫీ తీసుకుని ద్రోహానికి పరిహారం మరణం అని పేర్కొంటూ వాట్సాప్ స్టేటస్‌గా పెట్టుకున్నాడు. పోలీసులు వచ్చే వరకు అక్కడే కూర్చుండి పోయాడు.
కాగా, బాలమురుగన్ పైశాచికత్వాన్ని ప్రత్యక్ష్యంగా చూసిన హాస్టల్లో ఉంటున్నవారు భయాందోళనతో అక్కడి నుంచి పరుగులు తీశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితుడి అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు కొనసాగిస్తున్నారు. దంపతుల మధ్య ఉన్న మనస్పర్థలు, వివాహేతర సంబంధంపై అనుమానమే ఈ ఘోరానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.