ఘజియాబాద్: కోటి రూపాయల కోసం తన ఇంట్లో అద్దెకుండే పీహెచ్డీ విద్యార్థిని చంపి మూడు ముక్కలు చేసి కాలువల్లో పడేశాడు ఓ ఇంటి యజమాని. ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్ జిల్లాలో రెండు నెలల క్రితం జరిగిన ఈ దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఢిల్లీలో శ్రద్ధా వాకర్ అమానుష ఘటన తర్వాత ఇలాంటి దారుణాలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. పోలీసుల కథనం ప్రకారం.. ఘజియాబాద్ జిల్లాలోని మోదీనగర్‌లో ఉమేశ్ శర్మకు ఒక ఇల్లు ఉన్నది. దానిని పీహెచ్డీ స్కాలర్ అయిన అంకిత్ ఖకోర్ (45)కు అద్దెకు ఇచ్చాడు. తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత అంకిత్ కొన్నేండ్లుగా అదే ఇంట్లో అద్దెకు ఉంటున్నారు. ఇంటి యజమాని ఉమేశ్ శర్మకు అంకిత్ మధ్య స్నేహం ఏర్పడింది. వారసత్వ ఆస్తిని విక్రయించగా అంకిత్‌కు రూ.1 కోటి వచ్చాయి.
ఆ విషయం తెలిసి రూ.40 లక్షలు అప్పుగా ఇవ్వాలని ఉమేశ్ కోరగా అంకిత్ ఇచ్చాడు. రూ.40 లక్షలు తిరిగి ఇవ్వకుండా, మిగతా రూ.60 లక్షలు కూడా కాజేయాలంటే అంకిత్‌ను చంపాలని ఇంటి యజమాని ప్లాన్ వేశాడు. తన స్నేహితుడు పర్వేశ్ సహకారంతో అక్టోబర్ 6న అంకిత్‌ను గొంతు కోసి చంపేశారు. రంపంతో అతడి శరీరాన్ని ముక్కలుగా కోసి వేర్వేరు చోట్ల విసిరేశారు. అనుమానం రాకుండా డబ్బులు డ్రా చేసేందుకు పర్వేశ్‌ను ఉమేశ్ ఉత్తరాఖండ్‌కు పంపించాడు. అక్కడ అంకిత్ ఏటీఎం కార్డు ద్వారా సుమారు రూ.20 లక్షలు డ్రా చేశారు. స్నేహితులు ఎన్నిసార్లు ఫోన్‌చేసిన అంకిత్ జవాబు ఇవ్వకపోవడం, టెక్ట్స్ మెస్సేజ్‌లలో వ్యక్తీకరణ తేడాగా ఉండటంతో అతడి ఇంటికి వచ్చారు. అంకిత్ కనిపించకపోవడంతో స్నేహితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.