లక్నో: హెరాయిన్ (heroin) కలిగి ఉన్నాడంటూ పోలీసులు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు. దీంతో 20 ఏళ్లుగా అతడు జైల్లో ఉన్నాడు. అయితే అది హెరాయిన్ కాదు పౌడర్ అని చివరకు నిర్ధారణ అయ్యింది. దీంతో అతడు జైలు నుంచి విముక్తి పొందాడు. ఉత్తరప్రదేశ్‌లోని బస్తీ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అబ్దుల్లా అయ్యూబ్‌కు చెందిన ఇంట్లో పోలీస్ కానిస్టేబుల్ ఖుర్షీద్ అద్దెకు ఉన్నాడు. అయితే అతడు అద్దె చెల్లించకపోవడంతో ఇంటిని ఖాళీ చేయించాడు. దీంతో అబ్దుల్లా అయ్యూబ్‌పై పోలీస్ కానిస్టేబుల్ ఖుర్షీద్ కక్ష పెంచుకున్నాడు. పోలీస్ అధికారులైన సీవో అనిల్ సింగ్, పురాణా బస్తీ ఎస్వో లాల్జీ యాదవ్, ఎస్ఐ నర్మదేశ్వర్ శుక్లాతో కలిసి కుట్ర పన్నాడు. 2003 మార్చి 14న అబ్దుల్లా అయ్యూబ్ ఒక షాపులో రూ.20కు ఒక పౌడర్ కొన్నాడు. అయితే 25 గ్రాముల పౌడర్‌ను కోటి విలువచేసే హెరాయిన్‌గా పోలీసులు ఆరోపించారు. దానిని స్వాధీనం చేసుకుని అయ్యూబ్‌ను అరెస్ట్ చేశారు.
కాగా, ఫోరెన్సిక్ సాక్ష్యాలను కూడా పోలీసులు తారుమారు చేశారు. దీంతో ఆ పౌడర్ హెరాయిన్ అని బస్తీలోని ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇచ్చింది. అబ్దుల్లా అయ్యూబ్ తరుఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేయగా ఆ పౌడర్ నమూనాలను పరీక్ష కోసం లక్నో ల్యాబ్‌కు కోర్టు పంపింది. దీంతో అది హెరాయిన్ కాదని అక్కడ తేలింది. ఈ నేపథ్యంలో ఆ పౌడర్ నమూనాను చివరకు ఢిల్లీ ల్యాబ్‌కు పంపారు. అయితే అక్కడ కూడా ఫోరెన్సిక్ సాక్ష్యాలను పోలీసులు తారుమారు చేశారు. దీంతో అది హెరాయిన్ అని రిపోర్ట్ వచ్చింది.
మరోవైపు ఈ గందరగోళం నేపథ్యంలో ఆ పౌడర్ హెరాయిన్ కాదన్న లక్నో ఫోరెన్సిక్ ల్యాబ్ నిఫుణులకు కోర్టు సమన్లు జారీ చేసింది. దీంతో కోర్టుకు వచ్చిన నిఫుణులు తమ వివరణ ఇచ్చారు. అది నకిలీ పౌడర్ అని బ్రౌన్ కలర్లోకి మారిందని తెలిపారు. అసలైన హెరాయిన్ ఎలాంటి వాతావరణంలో అయినా రంగు మారదని స్పష్టం చేశారు. దీంతో తప్పుడు ఆరోపణలపై 20 ఏళ్లుగా జైల్లో ఉన్న అబ్దుల్లా అయ్యూబ్‌ను నిర్దోషిగా పేర్కొన్న కోర్టు జైలు నుంచి విడుదల చేసింది. మొత్తం వ్యవహారాన్ని పోలీసులు తప్పుగా చూపించారని న్యాయమూర్తి ఆరోపించింది. కోర్టు సమయాన్ని వృథా చేయడంపై మండిపడ్డారు. అయితే ఈ కుట్రకు పాల్పడిన పోలీసులపై చర్యలకు ఇంకా ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదు.