భోపాల్: భార్య వేధింపులు తట్టుకోలేక ఒక వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతడి భార్య, అత్త దీనిని ఇన్స్టాగ్రామ్ లైవ్లో చూశారు. (man hangs self, wife watched live) ఆ వ్యక్తిని కాపాడేందుకు వారు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. ఈ నేపథ్యంలో వారిద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 26 ఏళ్ల శివ ప్రకాష్ త్రిపాఠికి రెండేళ్ల కిందట ప్రియా శర్మతో పెళ్లి జరిగింది. అయితే కొన్ని నెలలుగా వైవాహిక సమస్యలతో అతడు బాధపడుతున్నాడు. భార్య మరో వ్యక్తితో తరచుగా మాట్లాడటాన్ని గమనించాడు. పద్ధతి మార్చుకోవాలని ఆమెకు నచ్చజెప్పేందుకు ప్రయత్నించాడు.
కాగా, శివ ప్రకాష్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. దీంతో ఊతకర్రలపై ఆధారపడ్డాడు. అయితే భార్య ప్రియ అతడ్ని వదిలేసింది. పసి బిడ్డతో కలిసి పుట్టింటికి వెళ్లిపోయింది. భార్యను తిరిగి తెచ్చేందుకు శివ చాలాసార్లు ప్రయత్నించాడు. ఆమె పుట్టింటికి వెళ్లి రాజీపడినప్పటికీ భార్య తిరిగి రాలేదు.
మరోవైపు భార్య ప్రియకు నచ్చజెప్పేందుకు శివ ప్రకాష్ చివరిసారి ప్రయత్నించాడు. ఇటీవల అత్తగారింటికి వెళ్లిన అతడు ఇంటికి తిరిగి రావాలని భార్యను ప్రాధేయపడ్డాడు. అయితే ప్రియ, ఆమె తల్లి అతడ్ని అవమానించడంతోపాటు కొట్టారు. దీంతో బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. తన గదిలోకి వెళ్లి లాక్ చేసుకున్నాడు. ఇన్స్టాగ్రామ్ లైవ్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
కాగా, శివ ప్రకాష్ ఉరి వేసుకోవడాన్ని భార్య, ఆమె తల్లి ఇన్స్టాగ్రామ్ లైవ్లో చూశారు. అయినప్పటికీ అతడ్ని కాపాడేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. చివరకు శివ కుటుంబ సభ్యులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో అతడి ఆత్మహత్యపై కేసు నమోదు చేశారు. భార్య ప్రియ, ఆమె తల్లిని అరెస్ట్ చేసి కస్టడీకి తరలించారు. ప్రియకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని దర్యాప్తులో తెలుసుకున్నారు. ఈ కేసుపై మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.