తిరువనంతపురం: ఒక వ్యక్తిపై గ్యాంగ్ దాడి చేసింది. ఆ గ్యాంగ్ సభ్యులు కొడవళ్లతో ఆ వ్యక్తి వెంటపడ్డారు. కోర్టు బయట నరికి చంపారు. (Man hacked to death) గ్యాంగ్‌కు చెందిన ఒక వ్యక్తిని పోలీసులు, లాయర్లు పట్టుకున్నారు. కారును వెంబడించిన పోలీసులు పారిపోతున్న ఆ గ్యాంగ్‌కు చెందిన మిగతా వ్యక్తులను కూడా అరెస్ట్ చేశారు. తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మహిళ హత్య కేసులో నిందితుడైన 25 ఏళ్ల మాయండి శుక్రవారం కేసు విచారణ కోసం కోర్టు వద్దకు చేరుకున్నాడు. కోర్టు కాంప్లెక్స్‌కు ఎదురుగా ఉన్న రెస్టారెంట్ వద్ద అతడు ఉండగా ఒక గ్యాంగ్ దాడి చేసింది. దీంతో తప్పించుకునేందుకు మాయండి కోర్టు వైపు పరుగెత్తాడు. వెంబడించిన ఆ గ్యాంగ్ సభ్యులు కోర్టు బయట కోడవళ్లతో నరికి అతడ్ని హత్య చేశారు.
కాగా, ఈ సంఘటన చూసి కోర్టు కాంప్లెక్స్ వద్ద ఉన్న వారు షాక్ అయ్యారు. అప్రమత్తమైన పోలీసులు, లాయర్లు ఆ గ్యాంగ్‌కు చెందిన ఒక వ్యక్తిని పట్టుకున్నారు. మిగతా గ్యాంగ్ సభ్యులు కారులో పారిపోతుండగా పోలీసులు వెంబడించి అడ్డుకున్నారు. మరో నలుగురిని అరెస్ట్ చేశారు.
మరోవైపు 2023 ఆగస్ట్‌లో ఎస్సీ పంచాయతీ వార్డు సభ్యురాలు ఎన్ రాజమణి హత్యకేసులో మాయండి ఒక నిందితుడని పోలీస్ అధికారి తెలిపారు. దీంతో ఆమె హత్యకు ప్రతీకారంగా ఆ గ్యాంగ్ అతడ్ని హత్య చేసిందని చెప్పారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.