లక్నో: ఒక ఆలయంలోని దేవుడి విగ్రహాలు చోరీ అయ్యాయి. (Temple Idols Stolen) ఆ గుడి బాధ్యతలు చూసే వ్యక్తి దీని గురించి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అయితే ఫిర్యాదు చేసిన వ్యక్తి మరికొందరితో కలిసి దేవుడి విగ్రహాలను దొంగిలించినట్లు తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని మీర్జాపూర్లో ఈ సంఘటన జరిగింది. పద్రి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రాంతంలో పురాతన రామాలయం ఉంది. వంశీదాస్ అనే వ్యక్తి గత మూడేళ్లుగా ఆ గుడి నిర్వహణను పర్యవేక్షిస్తున్నాడు. ఆలయంలోని పురాతన దేవుడి విగ్రహాలు చోరీ అయ్యాయని జనవరి 14న పోలీస్ స్టేషన్లో అతడు ఫిర్యాదు చేశాడు. రాముడు, సీత, లక్ష్మణుడి విగ్రహాలు మాయమయ్యాయని చెప్పాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
కాగా, ఆలయంలోని దేవుడి విగ్రహాల చోరీపై ఫిర్యాదు చేసిన వంశీదాస్ వాటిని దొంగిలించినట్లు దర్యాప్తులో తెలుసుకుని పోలీసులు షాక్ అయ్యారు. జనవరి 18న అతడితోపాటు లవ్కుష్ పాల్, కుమార్ సోని, రామ్ బహదూర్ పాల్‌ను అరెస్ట్ చేశారు. వారు దొంగిలించి దాచిన దేవుడి విగ్రహాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు ఆలయ యాజమాన్యం అంశంలో గురువు మహారాజ్ జైరామ్, సాతువా బాబాతో వంశీదాస్కు చాలా కాలంగా వివాదం ఉన్నదని పోలీస్ అధికారి తెలిపారు. ఆలయ ఆస్తిని జైరామ్ దాస్ తన మేనల్లుడికి బదిలీ చేయడం గురించి అతడికి తెలిసిందని చెప్పారు. దీంతో మరో ముగ్గురితో కలిసి దేవుడి విగ్రహాలు దొంగిలించి వాటిని అమ్మేందుకు వంశీదాస్ కుట్రపన్నినట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీస్ అధికారి వెల్లడించారు.