న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో పెద్ద ఎత్తున కస్టమ్స్ అధికారులు కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. సోమవారం లైబీరియాకు చెందిన ఓ వ్యక్తి లాగోస్ నుంచి దోహా మీదుగా ఢిల్లీ చేరుకోగా సదరు వ్యక్తిని తనిఖీ చేయగా.. అతని వద్ద ఉన్న ట్రాలీ బ్యాగ్‌లో ఆఫ్ వైట్, వైట్ కలర్లో ఉన్న ఎనిమిది ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నట్లు బుధవారం కస్టమ్స్ విభాగం తెలిపింది. వాటిని పరీక్షించగా కొకైన్‌గా నిర్ధారణ అయ్యిందని కస్టమ్స్ డిపార్ట్మెంట్ ప్రకటన విడుదల చేసింది. మొత్తం 5.9 కిలోల కొకైన్ స్వాధీనం చేసుకున్నామని, అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ దాదాపు రూ.90కోట్ల వరకు ఉంటుందని తెలిపింది. సదరు వ్యక్తిని అరెస్టు చేసినట్లు ప్రకటనలో వివరించింది.