లక్నో: భార్యతో గొడవ వల్ల భర్త ఇంటి నుంచి వెళ్లిపోయాడు. వేరే ప్రాంతంలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసి భార్య కూడా సూసైడ్ చేసుకున్నది. (Couple Sucide Faraway) ఈ నేపథ్యంలో ఏడాదిన్నర కూతురు అనాథ అయ్యింది. రెండు ప్రాంతాలకు చెందిన పోలీసులు ఈ దంపతుల బలవంతపు మరణంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 32 ఏళ్ల ప్రతాప్ చౌహాన్, 28 ఏళ్ల శివాని భార్యాభర్తలు. ఢిల్లీ శివారు ప్రాంతమైన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో నివసిస్తున్నారు. వీరిద్దరూ తరచుగా గొడవపడుతున్నారు.
కాగా, జనవరి 10న ప్రతాప్, శివాని మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో ప్రతాప్ ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒకచోట నుంచి భార్యకు ఫోన్ చేశాడు. ఇకపై ఎప్పటికీ తనను ఆమె చూడలేదని చెప్పాడు. అక్కడి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరోవైపు బంధువైన మహిళ ఇది గమనించి శివానికి ఫోన్ చేసి చెప్పింది. దీంతో ఆమె కూడా ఇంటి నుంచి వెళ్లిపోయింది. 8 కిలోమీటర్ల దూరంలోని ఢిల్లీ శివారు ప్రాంతంలో విద్యుత్ స్తంభానికి ఉరి వేసుకుని సూసైడ్ చేసుకున్నది. ఈ నేపథ్యంలో ఏడాదిన్నర వయస్సున్న వారి కుమార్తె అనాథ అయ్యింది. భార్యాభర్తలు వేర్వేరు చోట్ల ఆత్మహత్యకు పాల్పడటంపై ఘజియాబాద్, ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.