న్యూఢిల్లీ: భార్యతో సన్నిహితంగా కనిపించిన యువకుడ్ని ఒక వ్యక్తి హత్య చేశాడు. గ్యాస్ సిలిండర్‌తో పలుసార్లు తలపై కొట్టి చంపాడు. (Man Kills Teen After Catching with Wife) ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. దేశ రాజధాని ఢిల్లీలో ఈ సంఘటన జరిగింది. 17 ఏళ్ల జతిన్ పది రోజుల కిందట పని కోసం ఢిల్లీకి చేరుకున్నాడు. గులాబీ నగర్ ప్రాంతంలోని 25 ఏళ్ల ముఖేష్ ఠాకూర్ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. మే 19 అర్ధరాత్రి తర్వాత ముఖేష్, జతిన్ కలిసి మద్యం సేవించారు. ఆ సమయంలో తన భార్యతో ఆ యువకుడు సన్నిహితంగా ఉండటాన్ని ముఖేష్ చూశాడు.
కాగా, మే 20న ఉదయం భార్య సుధా బొమ్మల ఫ్యాక్టరీలో పనికి వెళ్లగా జతిన్‌ను ముఖేష్ నిలదీశాడు. ఈ సందర్భంగా వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ఆగ్రహించిన ముఖేష్ చిన్న గ్యాస్ సిలిండర్‌తో జతిన్ తలపై పలుసార్లు గట్టిగా కొట్టాడు. దీంతో రక్తం మడుగుల్లో పడి ఆ యువకుడు అక్కడికక్కడ మరణించాడు.
మరోవైపు ముఖేష్ ఇంటి బయట ఉన్న డ్రెయిన్‌లో రక్తం ప్రవహించడాన్ని స్థానికులు చూశారు. ముఖేష్ ఇంటి డోర్‌ను తట్టగా చాలా సేపు తర్వాత అతడు తెరిచాడు. అయితే ఇంటి లోపల రక్తం మడుగుల్లో యువకుడు మరణించడాన్ని స్థానికులు గమనించారు. ముఖేష్ పారిపోయేందుకు ప్రయత్నించగా డోర్ మూసి లాక్ చేశారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.
కాగా, పోలీసులు ఆ ఇంటికి చేరుకున్నారు. జతిన్‌ను హత్య చేసిన ముఖేష్‌ను అరెస్ట్ చేశారు. పోస్ట్‌మార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు.