బెంగళూరు: ప్రేమించిన యువతితో పెళ్లికి ఆమె కుటుంబం నిరాకరించింది. ఈ నేపథ్యంలో ప్రేమికుడు ఆమె ఇంటి ముందు జిలెటిన్ స్టిక్‌తో పేల్చుకున్నాడు. (Man blows with gelatin stick) పేలుడు తీవ్రత వల్ల ఆ యువకుడు మరణించాడు. అతడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కర్ణాటకలోని మాండ్యా జిల్లాలో ఈ సంఘటన జరిగింది. కాలేనహళ్లి గ్రామానికి చెందిన 21 ఏళ్ల రామచంద్ర అదే ప్రాంతానికి చెందిన మైనర్ బాలిక ప్రేమించుకున్నారు. గత ఏడాది ఆ అమ్మాయి, అతడు కలిసి ఇంటి నుంచి పారిపోయారు. ఈ నేపథ్యంలో యువతి కుటుంబం ఫిర్యాదుతో పోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద రామచంద్రపై పోలీసులు కేసు నమోదు చేశారు. అరెస్టైన అతడు మూడు నెలలు జైలులో ఉన్నాడు. అమ్మాయి కుటుంబంతో రాజీ నేపథ్యంలో అతడిపై నమోదైన కేసును కొట్టివేశారు.
కాగా, సెటిల్మెంట్ తర్వాత కూడా ఆ అమ్మాయితో సంబంధాన్ని రామచంద్ర కొనసాగించాడు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే యువతి కుటుంబం దీనికి నిరాకరించింది. చట్టబద్ధమైన వయస్సు వచ్చిన తర్వాత మరో వ్యక్తితో ఆమెకు పెళ్లి చేయాలన్న యోచనలో వారు ఉన్నారు.
మరోవైపు ప్రేమించిన యువతితో పెళ్లికి ఆమె కుటుంబం తిరస్కరించడంపై రామచంద్ర కలత చెందాడు. డిసెంబర్ 29న ప్రియురాలి ఇంటి బయట జిలాటిన్ స్టిక్‌తో తనను తాను పేల్చుకున్నాడు. పేలుడు ధాటికి అక్కడికక్కడే అతడు మరణించాడు. దీంతో రామచంద్ర కుటుంబం ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.