భోపాల్: పాము కాటు కుంభకోణం గురించి తాను ఎప్పుడూ వినలేదని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ జితు పట్వారీ (Snakebite Scam) అన్నారు. అయితే సీఎం మోహన్ యాదవ్ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వంలో ఇలాంటి కొత్త కుంభకోణం జరిగిందని విమర్శించారు. ఒక వ్యక్తిని 38 సార్లు పాము కాటుకు గురిచేశారని, పరిహారం పేరుతో రూ.11 కోట్లు కాజేశారని ఆరోపించారు. ‘వివిధ రకాల అవినీతి, అక్రమాలను చూశాం. కానీ సియోనీ జిల్లాకు చెందిన ఒక వ్యక్తిని 38 సార్లు పాములు కాటు వేశాయి. ప్రతిసారీ రూ.4 లక్షలు (పాము కాటుకు గురైన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అందించే పరిహారం) విత్ డ్రా చేశారు. పాము కాటు పరిహారంగా ఒక జిల్లాకే రాష్ట్ర ప్రభుత్వం నుంచి దాదాపు రూ.11 కోట్లకు పైగా తీసుకున్నారు. పాము కాటు కుంభకోణం గురించి మేం ఎప్పుడూ వినలేదు. కానీ మధ్యప్రదేశ్లో ఇది వెలుగులోకి వచ్చింది. ఆర్థిక వనరులను ఎలా దోచుకుంటున్నారో చూడండి’ అని మండిపడ్డారు.
కాగా, మధ్యప్రదేశ్లోని సియోనీ జిల్లాలో ఆర్థిక అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ జిల్లాలో సుమారు 47 మంది పాము కాటు వల్ల పలుసార్లు చనిపోయినట్లు అధికారికంగా పేర్కొన్నారు. నకిలీ మృతుల జాబితాలో ఒకే వ్యక్తిని పాము కాటు కారణంగా మరణించినట్లు 30 సార్లు చూపించారు. మరో వ్యక్తిని 19 సార్లు చనిపోయినట్లు ప్రకటించారు. ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వం అందించే రూ.4 లక్షల పరిహారాన్ని మంజూరు చేశారు. దీంతో రూ.11.26 కోట్ల కుంభకోణం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మరోవైపు ఈ ఆరోపణలపై ఆర్థిక శాఖ బృందం దర్యాప్తు చేసిందని జబల్పూర్ డివిజనల్ జాయింట్ డైరెక్టర్ (ట్రెజరీస్ అండ్ అకౌంట్స్) రోహిత్ సింగ్ కౌశల్ తెలిపారు. తదుపరి చర్యల కోసం సియోనీ కలెక్టర్కు నివేదికను సమర్పించినట్లు చెప్పారు.