Crime news : దేశ రాజధాని ఢిల్లీ (Delhi) లో సోమవారం సాయంత్రం దారుణం జరిగింది. ఓ 25 ఏళ్ల వ్యక్తి తన తల్లి, చెల్లి, తమ్ముడిని దారుణంగా హత్యచేసి.. అనంతరం పోలీస్‌స్టేషన్ (Police station) కు వెళ్లి లొంగిపోయాడు. తాను చేసిన నేరాన్ని ఒప్పుకున్నాడు. ఢిల్లీలోని లక్ష్మీనగర్ పోలీస్‌స్టేషన్ (Laxminagar PS) పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది.
ఢిల్లీ పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం 5 గంటలకు మంగల్ బజార్ ఏరియాకు చెందిన యశ్వీర్ సింగ్ అనే 25 ఏళ్ల వ్యక్తి లక్ష్మీనగర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఆర్థిక సమస్యల కారణంగా తాను తన తల్లిని, చెల్లిని, తమ్ముడిని హత్య చేశానని చెప్పాడు. మృతుల్లో తన తల్లి కవిత (46), చెల్లి మేఘన (24), తమ్ముడు ముకుల్ (14) ఉన్నారని తెలిపాడు.
దాంతో పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి వెళ్లారు. ఇంట్లో పడివున్న మూడు మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు కొనసాగుతున్నదని తెలిపారు.